కొత్త యాప్.. అరట్టై.. వాట్సాప్ కు పోటీ ఇస్తుందా?

  • చెన్నైకి చెందిన జోహో కార్పోరేషన్ అభివృద్ధి చేసిన యాప్ అరట్టై
  • సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న అరట్టై
  • ఈ యాప్ ను ప్రోత్సహిస్తున్న కేంద్ర మంత్రులు ధర్మేంధ్ర ప్రదాన్, అశ్విని వైష్ణవ్
చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్ అభివృద్ధి చేసిన ‘అరట్టై’ యాప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. యాపిల్ యాప్ స్టోర్‌లో సోషల్ నెట్‌వర్కింగ్ విభాగంలో ఇది నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

‘అరట్టై’ అంటే తమిళంలో “మాట్లాడటం” అని అర్థం. టెక్స్ట్ మెసేజ్‌లు, వాయిస్/ వీడియో కాల్స్, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పంపడం, స్టోరీస్, ఛానల్స్ క్రియేట్ చేయడం ఇలా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అవసరాలకు తగిన ఫీచర్లతో ఈ యాప్‌ను రూపొందించారు.

దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ యాప్‌ను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, అశ్వినీ వైష్ణవ్ ప్రోత్సహిస్తున్నారు. తాజాగా తాను జోహోకు మారుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ బదులుగా జోహోతోనే తాజా కేబినెట్ ప్రజెంటేషన్ తయారు చేసినట్లు ఆయన తెలిపారు. ఇదే తరహాలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కూడా ఈ యాప్‌ను ప్రోత్సహిస్తూ ప్రజలకు వాడాలని సూచించారు.

అయితే, ప్రస్తుతం అరట్టై యాప్‌లో కాల్స్‌కు మాత్రమే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంది. మెసేజ్‌లకు ఈ సదుపాయం లేకపోవడం, గోప్యత గురించి ఆందోళనలకు కారణమవుతోంది. మెసేజ్‌లను థర్డ్ పార్టీ వ్యక్తులు కూడా చూడొచ్చు. వాట్సాప్ లాంటి గ్లోబల్ దిగ్గజానికి ధీటుగా నిలవాలంటే ఈ లోటును భర్తీ చేయాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అరట్టై స్థానిక యాప్‌గా ప్రస్తుతం ఆదరణ పొందుతోంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు చేసుకుంటూ కొత్త ఫీచర్లు చేర్చుకుంటూ వెళితే వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా మారొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 


More Telugu News