వాంగ్‌చుక్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నాం: లడఖ్ డీజీపీ

  • వాంగ్‌చుక్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న పాకిస్థానీ గూఢచారిని అరెస్టు చేసినట్లు వెల్లడి
  • వాంగ్‌చుక్‌ నిరసనల వీడియోలను పాకిస్థాన్‌కు పంపినట్లు వెల్లడి
  • లడఖ్ హింస వెనుక వాంగ్‌చుక్‌ కీలక వ్యక్తి అన్న డీజీపీ
లడఖ్ ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని డీజీపీ ఎస్‌డీ సింగ్ జామ్వాల్ వెల్లడించారు. లెహ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వాంగ్‌చుక్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న ఒక పాకిస్థానీ గూఢచారిని ఇటీవల అరెస్టు చేసినట్లు తెలిపారు.

సోనమ్ నిరసనల వీడియోలను ఆ వ్యక్తి పాకిస్థాన్‌కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. లడఖ్‌లో చెలరేగిన హింస వెనుక వాంగ్‌చుక్ కీలక వ్యక్తి అని, ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని డీజీపీ ఆరోపించారు. వాంగ్‌చుక్‌ విదేశీ పర్యటనల్లో కొన్ని అనుమానాస్పదంగా ఉన్నాయని ఆయన అన్నారు. పాకిస్థాన్‌లో ది డాన్ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారని, బంగ్లాదేశ్‌ను కూడా సందర్శించారని తెలిపారు.

వాంగ్‌చుక్‌ స్వచ్ఛంద సంస్థకు విదేశీ నిధులపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం, లడఖ్ ప్రతినిధుల మధ్య చర్చలను అడ్డుకునేందుకు వాంగ్‌చుక్‌ ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఈ నెల 25న ఇరుపక్షాల మధ్య సమావేశం ఉందని తెలిసి కూడా తన నిరాహార దీక్షను కొనసాగించారని వెల్లడించారు. సమావేశానికి ఒకరోజు ముందు రెచ్చగొట్టే వీడియోలు, ప్రకటనలు చేశారని ఆయన ఆరోపించారు.

ఉద్దేశపూర్వకంగా శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆయన అన్నారు. ఆయన తీరు హింసకు, మరణాలకు దారి తీసిందని విమర్శించారు.

లడఖ్ హింసలో విదేశీ కుట్ర జరిగిందంటూ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా చేసిన ఆరోపణలపై డీజీపీ స్పందిస్తూ, ముగ్గురు నేపాల్ పౌరులు బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చేరారని తెలిపారు. మరికొందరి ప్రమేయం కూడా వెలుగులోకి వచ్చిందని అన్నారు. మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిలో దాదాపు 10-12 మందిని ప్రధాన నిందితులుగా అనుమానిస్తున్నట్లు తెలిపారు.


More Telugu News