జైల్లోనే 7 డిగ్రీలు.. ఇప్పుడు గోల్డ్ మెడల్.. జీవిత ఖైదీ స్ఫూర్తిదాయక ప్రస్థానం

  • హత్య కేసులో జీవిత ఖైదీగా ఉన్న గునుకుల యుగంధర్
  • జైల్లోనే చదువుకుని బీఏలో గోల్డ్ మెడల్ కైవసం
  • అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి బంగారు పతకానికి ఎంపిక
  • ఇప్పటికే 4 బీఏలు, 3 ఎంఏలు పూర్తి చేసిన ఖైదీ
  • కొడుకును క్షమించి విడుదల చేయాలని ప్రభుత్వానికి తల్లి విజ్ఞప్తి
  • సత్ప్రవర్తన కింద క్షమాభిక్ష పెట్టాలని అభ్యర్థన
హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ జీవిత ఖైదీ విద్యారంగంలో అరుదైన ఘనత సాధించాడు. కడప కేంద్ర కారాగారంలో ఉంటూనే చదువుపై దృష్టి పెట్టి, ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఏకంగా గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఈ స్ఫూర్తిదాయక ఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

వివరాల్లోకి వెళితే... తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం జంగాలపల్లెకు చెందిన గునుకుల యుగంధర్‌కు 2011లో ఓ హత్య కేసులో జీవిత ఖైదు పడింది. అప్పటి నుంచి ఆయన కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, జైలు జీవితాన్ని వృధా చేయకుండా, తన భవిష్యత్తును చక్కదిద్దుకోవాలనే తపనతో చదువును ఆయుధంగా ఎంచుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా తన విద్యను కొనసాగించారు. పట్టుదలతో చదివి ఇప్పటికే నాలుగు బీఏలు, మూడు ఎంఏలు పూర్తి చేశారు.

తాజాగా పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్టులతో పూర్తి చేసిన బీఏ డిగ్రీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. మొత్తం 8.02 జీపీఏ సాధించి యూనివర్సిటీ గోల్డ్ మెడల్‌కు ఎంపికయ్యారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో జరగనున్న వర్సిటీ 26వ స్నాతకోత్సవంలో ఈ బంగారు పతకాన్ని అందుకునేందుకు ఆయనకు ఆహ్వానం అందింది.

ఈ నేపథ్యంలో యుగంధర్ తల్లి చెంగమ్మ గురువారం కడప సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. దాదాపు 15 ఏళ్లుగా తన కుమారుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడని, జైలులో సత్ప్రవర్తనతో మెలుగుతూ చదువులో రాణించాడని ఆమె పేర్కొన్నారు. తన కుమారుడు గోల్డ్ మెడల్ సాధించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రభుత్వం దయతలచి క్షమాభిక్ష కింద అతడిని విడుదల చేయాలని కన్నీటితో వేడుకున్నారు. ప్రభుత్వం తమ ఆవేదనను అర్థం చేసుకుని, తన బిడ్డకు కొత్త జీవితాన్ని ప్రసాదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


More Telugu News