భారత గగనతల రక్షణకు కీలకమైన ఎస్-400 డెలివరీ వచ్చే ఏడాది పూర్తి!

  • రష్యన్ వర్గాలను ఉటంకిస్తూ ఆ దేశ మీడియాలో కథనం
  • 2018లో ఎస్-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం
  • ఇప్పటికే నాలుగు వ్యవస్థలను అందించిన రష్యా
  • 2026 నాటికి ఐదో వ్యవస్థను అందించనున్న రష్యా
భారత గగనతల రక్షణ వ్యవస్థకు కీలకమైన ఎస్-400 క్షిపణి వ్యవస్థల డెలివరీ వచ్చే ఏడాదికి పూర్తి కానుంది. ఒప్పందం ప్రకారం 2026 నాటికి భారత్‌కు ఈ క్షిపణి వ్యవస్థలను రష్యా అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రష్యన్ వర్గాలను ఉటంకిస్తూ ఆ దేశ మీడియా కథనం వెలువరించింది.

ఐదు ఎస్-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు 2018లో రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ 5.43 బిలియన్ డాలర్లు. ఇప్పటి వరకు నాలుగు వ్యవస్థలను భారత్‌‍కు అప్పగించగా, మరో వ్యవస్థను వచ్చే ఏడాదికి డెలివరీ చేయనున్నట్లు ఆ కథనం తెలిపింది.

ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ఎస్-400 సమర్థంగా పనిచేసింది. పాకిస్థాన్‌కు చెందిన లక్ష్యాన్ని ఏకంగా 300 కిలోమీటర్ల అవతల నుంచి గుర్తించి ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. రష్యా నుంచి మరిన్ని క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నామని రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ తెలిపారు. మరింత శక్తిమంతమైన ఎస్-500 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


More Telugu News