హ్యాండ్‌షేక్ వివాదం... రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కు అండగా నిలిచిన ఐసీసీ

  • ఆసియా కప్‌లో హ్యాండ్‌షేక్ వివాదం
  • రిఫరీ క్షమాపణ.. మెత్తబడ్డ పాకిస్థాన్
  • మ్యాచ్ అధికారుల నియామకం తమ విచక్షణాధికారమన్న ఐసీసీ
ఆసియా కప్ 2025లో చోటుచేసుకున్న తీవ్ర వివాదం చివరికి సద్దుమణిగింది. భారత్‌తో మ్యాచ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, టోర్నమెంట్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించిన పాకిస్థాన్... మ్యాచ్ రిఫరీ క్షమాపణ చెప్పడంతో వెనక్కి తగ్గింది. దీంతో టోర్నీలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. 

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ల మధ్య హ్యాండ్‌షేక్ జరగకపోవడం వివాదానికి దారితీసింది. దీనికి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వైఖరే కారణమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర ఆరోపణలు చేసింది. రిఫరీని మార్చాలంటూ ఐసీసీపై ఒత్తిడి తెచ్చింది. యూఏఈతో జరగాల్సిన తమ తర్వాతి మ్యాచ్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాలతో టోర్నీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

అయితే, మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఆండీ పైక్రాఫ్ట్.. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, టీమ్ మేనేజర్‌తో సమావేశమయ్యారు. టాస్ సందర్భంగా తన వైపు నుంచి "కమ్యూనికేషన్ గ్యాప్" జరిగిందని అంగీకరించి, వారికి క్షమాపణ తెలిపారు. ఈ విషయాన్ని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ధ్రువీకరించారు. "భారత్‌తో మ్యాచ్ నుంచి ఈ సంక్షోభం నడుస్తోంది. రిఫరీ ప్రవర్తనపై మాకున్న అభ్యంతరాలు, ఆయన క్షమాపణ చెప్పడంతో పరిష్కారమయ్యాయి" అని ఆయన వివరించారు.

రిఫరీకి ఐసీసీ అండ:

మరోవైపు, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాత్రం మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కు గట్టిగా మద్దతుగా నిలిచింది. ఆయన ఏ నిబంధననూ ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. రిఫరీని మార్చాలన్న పీసీబీ డిమాండ్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. పైక్రాఫ్ట్ చెప్పిన క్షమాపణ కేవలం భావప్రసార లోపానికి మాత్రమే పరిమితమని, హ్యాండ్‌షేక్ ఘటనకు కాదని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. మ్యాచ్ అధికారుల నియామకం తమ విచక్షణాధికారమని, సభ్య దేశాలు ఇందులో జోక్యం చేసుకోలేవని ఐసీసీ స్పష్టం చేసింది.


More Telugu News