న్యూయార్క్‌లో అత్యంత విలాసవంతమైన భవనం కొనుగోలు చేసిన ముఖేశ్ అంబానీ!

  • విదేశాల్లో విలాసవంతమైన ఆస్తులు కొనుగోలు చేస్తున్న ముఖేశ్ అంబానీ
  • న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత ట్రైబెకా ప్రాంతంలో రూ.145 కోట్లు వెచ్చించి భవంతిని కొనుగోలు చేసిన ముఖేశ్ అంబానీ కంపెనీ
  • బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్‌లో భారత్‌లో మొదటి స్థానంలో, ప్రపంచ స్థాయిలో 18వ స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ
భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ విదేశాల్లో విలాసవంతమైన ఆస్తుల కొనుగోలును కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన అమెరికాలో మరో విలాసవంతమైన భవంతిని సొంతం చేసుకున్నారు. న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత ట్రైబెకా ప్రాంతంలో ఉన్న భవంతిని సుమారు 17.4 మిలియన్ డాలర్లు (సుమారు రూ.145 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసినట్టు 'ద రియల్ డీల్' నివేదిక వెల్లడించింది.

ఈ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అమెరికా విభాగం కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ భవంతిని టెక్ బిలియనీర్ రాబర్ట్ పెరా 2018లో దాదాపు 20 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి, లగ్జరీ హోమ్‌గా అభివృద్ధి చేయాలని భావించారు. కానీ ఆ ప్రణాళికలు కార్యరూపం దాల్చకపోవడంతో 2021లో ఆయన దాన్ని 25 మిలియన్ డాలర్లకు విక్రయానికి పెట్టారు. తాజాగా, ముకేశ్ అంబానీ కుటుంబం ఈ భవంతిని సొంతం చేసుకుంది.

అయితే, ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ముకేశ్ అంబానీ 2023 ఆగస్టులో మాన్‌హాటన్‌లో హడ్సన్ నదికి ఎదురుగా ఉన్న 9 మిలియన్ డాలర్ల విల్లాను విక్రయించారు. దానికి కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఈ కొత్త ఇంటిని కొనుగోలు చేయడం విశేషం.

బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ముకేశ్ అంబానీ నికర ఆస్తులు 97.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8.2 లక్షల కోట్లు). దీంతో భారతదేశంలో అగ్రస్థానం, ప్రపంచవ్యాప్తంగా 18వ స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన తర్వాత స్థానంలో ఉన్న ఆదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ ఆదానీ నికర ఆస్తులు 82.1 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అదే నివేదిక పేర్కొంది. 


More Telugu News