రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి: కేటీఆర్ సవాల్

  • ఆరు నుంచి తొమ్మిది నెలల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని జోస్యం
  • గ్రూప్-1 పోస్టులను రూ.1,700 కోట్లకు అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణ
  • యూరియాను కాంగ్రెస్ నేతలు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని మండిపాటు
తెలంగాణ రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు వస్తే ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందామని అన్నారు. "రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీవు మగాడివైతే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. ఎన్నికల్లో చూసుకుందాం" అని వ్యాఖ్యానించారు. రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

గద్వాల బీఆర్ఎస్ సభలో కేటీఆర్ మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆయన నిజంగా మగాడైతే ఆ పది మంది ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించాలి. అప్పుడు ఎన్నికల్లో ప్రజలు ఎవరి పనితీరు బాగుందో నిర్ణయిస్తారు" అని అన్నారు. గతంలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఆ మాటను ఎందుకు గుర్తుచేసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. "అవసరమైతే రైలు కింద తలపెడతా కానీ కాంగ్రెస్‌లో చేరను అని చెప్పిన వ్యక్తి ఆయనే. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారాను అంటున్నారు. అది నిజంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమా లేక ఆయన సొంత అభివృద్ధి కోసమా?" అని నిలదీశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ పలు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో 563 గ్రూప్-1 ఉద్యోగాలను ఒక్కొక్కటి రూ. 3 కోట్ల చొప్పున అమ్ముకున్నారని, దీని ద్వారా దాదాపు రూ.1,700 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. రైతులకు అందాల్సిన యూరియాను కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని... రైతులు ఎండలో, వానలో యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆయన మండిపడ్డారు.


More Telugu News