Amir-Kaif: కైఫ్-ఆమిర్ మాటల యుద్ధం.. వివాదంలోకి సౌరవ్ గంగూలీ

Amirs Shock Response To Kaifs Criticism
  • ఫీల్డింగ్ వల్లే కైఫ్ జట్టులోకి వచ్చాడన్న ఆమిర్
  • సౌరవ్ గంగూలీ వల్లే కైఫ్ కెరీర్ సాగిందని వ్యాఖ్య
  • అటెన్షన్ కోసమే ఆమిర్ భారత్‌పై మాట్లాడుతున్నాడన్న కైఫ్
  • అమెరికా చేతిలో పాక్ ఓటమిని గుర్తు చేసిన భారత మాజీ క్రికెటర్
  • అభిషేక్ శర్మపై ఆమిర్ విమర్శలతో మొదలైన వివాదం
టీ20 ప్రపంచకప్ ఫైనల్ ముంగిట భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్, పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తనపై కైఫ్ చేసిన వ్యాఖ్యలకు ఆమిర్ ఘాటుగా బదులిస్తూ వ్యక్తిగత విమర్శలకు దిగాడు. సౌరవ్ గంగూలీ దయవల్లే కైఫ్ భారత జట్టుకు ఆడాడని, అతను కేవలం ఫీల్డింగ్ కోసమే జట్టులో ఉన్నాడని ఎద్దేవా చేశాడు.

ఇటీవల మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ఆమిర్ కేవలం వార్తల్లో నిలిచేందుకే భారత జట్టుపైనా, ఆటగాళ్లపైనా విమర్శలు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. దీనిపై తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందించిన ఆమిర్, కైఫ్ కెరీర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. "భారత్ గురించి మాట్లాడితే నాకు అటెన్షన్ రావాల్సిన అవసరం లేదు. మిస్టర్ కైఫ్, నేను 350 టీ20 మ్యాచ్‌లు ఆడాను. నా గణాంకాలు చూడండి. నేను కేవలం ఫీల్డింగ్ మీద ఆధారపడి క్రికెట్ ఆడలేదు. ప్రదర్శనతోనే జట్టులో చోటు సంపాదించాను. మీరు మాత్రం మీ కెరీర్ కోసం దాదా (సౌరవ్ గంగూలీ)కి థ్యాంక్స్ చెప్పాలి" అని ఆమిర్ అన్నాడు.

"మీరు కేవలం ఫీల్డింగ్ వల్లే క్రికెట్ ఆడారని విన్నాను. మీ ఐపీఎల్ గణాంకాలు చూశాను. కేవలం 103 స్ట్రైక్ రేట్‌తో ఆడారు. మీలాంటి క్రికెటర్‌కు ఇటువంటి వ్యాఖ్యలు సరికావు" అంటూ ఆమిర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.

వివాదానికి అసలు కారణం ఇదే
టీ20 ప్రపంచకప్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఆటతీరుపై ఆమిర్ పదేపదే విమర్శలు చేస్తూ వచ్చాడు. అభిషేక్‌ను "స్లాగర్" అని, "వన్ డైమెన్షనల్ ప్లేయర్" అని పిలవడంతో ఈ వివాదం మొదలైంది. ఆమిర్ వ్యాఖ్యలపై స్పందించిన కైఫ్, అతడికి గట్టిగా బదులిచ్చాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో అమెరికా చేతిలో పాకిస్థాన్ ఓటమికి ఆమిరే కారణమని గుర్తుచేశాడు. "ఆ మ్యాచ్‌లో ఆమిర్ ఎన్నో వైడ్లు వేసి జట్టు ఓటమికి కారణమయ్యాడు. అలాంటి బౌలర్ మన గురించి మాట్లాడుతున్నాడు. పాకిస్థాన్ క్రికెట్ ఎంతో వెనుకబడి ఉంది. వారికి సరైన ఆటగాళ్లు, కెప్టెన్ లేరు. వారి వ్యాఖ్యలకు స్పందించి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు" అని కైఫ్ పేర్కొన్నాడు. కైఫ్ చేసిన ఈ వ్యాఖ్యలే ఆమిర్ ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం వ్యక్తిగత దూషణల వరకు దారితీసింది.
Amir-Kaif
Mohammad Kaif
Mohammad Amir
Sourav Ganguly
T20 World Cup
India vs Pakistan
Cricket Controversy
Abhishek Sharma
Cricket
Indian Cricket Team
Pakistan Cricket Team

More Telugu News