కోచ్‌గా వచ్చేందుకు నేను రెడీ: పుజారా

  • భారత టెస్టు క్రికెట్ కు నిశ్శబ్ద యోధుడిగా పేరు తెచ్చుకున్న చతేశ్వర్ పుజారా
  • టీమిండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నానన్న పుజారా
  • ప్రస్తుత కోచ్ గా గౌతమ్ గంభీర్
భారత టెస్టు క్రికెట్‌కు నిశ్శబ్ద యోధుడిగా పేరుగాంచిన చతేశ్వర్ పుజారా ఇప్పుడు భారత జట్టు కోచ్‌గా కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పుజారా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

పుజారా మాట్లాడుతూ, "క్రికెట్‌లో నాకు కలిగిన అనుభవాన్ని యువ ఆటగాళ్లతో పంచుకోవాలనే ఆసక్తి ఉంది. జట్టు అభివృద్ధికి నా వంతు సహకారం అందించాలని అనుకుంటున్నాను. కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని న్యూస్18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

పుజారా తన ఆటతీరుతో ఇదివరకే ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించారు. టెస్టుల్లో 103 మ్యాచ్‌లు, 7195 పరుగులు, 19 శతకాలు నమోదు చేసి భారత క్రికెట్‌కు నిలువెత్తు అంకితభావాన్ని చూపిన ఆటగాడిగా నిలిచారు. ప్రత్యేకంగా ఆస్ట్రేలియా పర్యటనలో బౌన్సర్లు తగిలినా వికెట్ పతనం ఆగిపోవాలనే తపనతో పుజారా చూపిన పట్టుదల అభిమానులను ఆకట్టుకుంది.

ప్రస్తుతం టీమిండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన పదవీకాలం ముగిశాక బీసీసీఐ కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. అప్పుడు బోర్డు పుజారాను పరిగణనలోకి తీసుకుంటుందా అనే ప్రశ్న ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 


More Telugu News