కంటి పరీక్షతో గుండెపోటు లక్షణాలను ముందే గుర్తించవచ్చు.. తాజా అధ్యయనంలో వెల్లడి

  • హృద్రోగ బాధితుల్లో కంటి చూపు మందగిస్తుందంటున్న నిపుణులు
  • రక్త ప్రసరణ సాఫీగా జరగకపోవడమే కారణమని వివరణ
  • మధుమేహంతో కంటి సమస్యలతో పాటు గుండెకూ ముప్పు
గుండె జబ్బుకు, కంటి చూపుకు సంబంధం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. హృద్రోగ బాధితుల్లో కంటి చూపు మందగించడం సహా కంటికి సంబంధించిన పలు సమస్యలు సాధారణమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు లక్షణాలను కంటి పరీక్షతో తెలుసుకోవచ్చని అన్నారు. రక్త నాళాల్లో అవాంతరాల వల్ల కంటి నరాలకు రక్తం సరిగా అందక చూపు మందగిస్తుందని, గుండె విషయంలోనూ ఇలాగే జరుగుతుందని చెప్పారు. హైబీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్ తదితర అనారోగ్యాలూ గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ప్రపంచవ్యాప్తంగా మరణాల్లో ప్రధాన కారణం గుండెపోటు అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గుండె పోటు లక్షణాలలో ఛాతీ నొప్పి, శ్వాస అందకపోవడం, హైబీపీ వంటి వాటితో పాటు తాజాగా కంటి చూపు కూడా చేరింది. కంటి పరీక్షలో గుండె పోటు లక్షణాలను ముందే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కంటి చూపు మందగించడం, చూపు కోల్పోవడం వంటి సమస్యలకు రెటీనా దెబ్బతినడమే కారణమని చెప్పారు. రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం, రక్త నాళాల్లో వాపు తదితర సమస్యల వల్ల రెటీనా దెబ్బతింటుందని వివరించారు.

సరిగ్గా ఇవే సమస్యలు గుండె అనారోగ్యానికీ కారణమవుతాయని, గుండె పోటుకు దారితీస్తాయని నిపుణులు తెలిపారు. ఈ క్రమంలో కంటి అనారోగ్యం మీ గుండె సమస్యలనూ గుర్తించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. మధుమేహ బాధితుల్లో ఇటు కంటి సమస్యలు, అటు గుండె జబ్బుల ముప్పు కూడా ఎక్కువేనని నిపుణులు హెచ్చరించారు. గుండె ఆరోగ్యానికి, కంటి చూపును కాపాడుకోవడానికి నిత్యం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు బ్రేక్ లేకుండా నిద్రించాలని నిపుణులు సూచిస్తున్నారు.


More Telugu News