ఆ అనుభవమే దేనికైనా సర్దుకుపోయే గుణాన్ని ఇచ్చింది: రకుల్ ప్రీత్ సింగ్

  • తన బాల్యం గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రకుల్
  • చిన్నప్పుడు దాదాపు 10 పాఠశాలలు మారానని వెల్లడి 
  • షూటింగ్‌ల సమయంలో ఒంటరిగా ఫీల్ అవ్వనని వ్యాఖ 
తన బాల్యంలో ఎదురైన సవాళ్లే తనను ఈ రోజు ఇంత దృఢంగా నిలబెట్టాయని ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. సైనిక కుటుంబ నేపథ్యం కారణంగా చిన్నప్పుడు తరచూ ప్రాంతాలు మారాల్సి వచ్చిందని, ఆ అనుభవాలే తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తండ్రి ఆర్మీలో పనిచేయడం వల్ల బాల్యంలో దాదాపు 10 పాఠశాలలు మారినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు.

ఈ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ, "చిన్నప్పుడు స్కూళ్లు మారడం వల్ల కొత్త ప్రదేశాలకు, కొత్త సంస్కృతులకు సులభంగా అలవాటుపడటం నేర్చుకున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోయే గుణం అలవడింది. ఈ అనుభవమే నన్ను ఈ రోజు ఇంత బలంగా మార్చింది" అని తెలిపారు. తరచూ కొత్త స్నేహితులను చేసుకోవడం వల్ల త్వరగా అందరితో కలిసిపోయే నైజం వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

సినిమా షూటింగ్‌ల కోసం కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు కూడా తనకు ఒంటరితనం అనిపించదని రకుల్ స్పష్టం చేశారు. "బాల్యం నుంచే ధైర్యంగా, స్వతంత్రంగా ఉండటం నేర్చుకున్నాను. అందుకే ఇప్పుడు ఒంటరిగా ఉన్నా, కుటుంబాన్ని మిస్ అవుతున్నాననే ఫీలింగ్ ఎక్కువగా ఉండదు. నా బాల్యమే నాకు గొప్ప పాఠాలు నేర్పింది" అని ఆమె వివరించారు.

ప్రస్తుతం రకుల్ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ‘మేరే హస్బెండ్ కీ బివీ’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆమె, ఇప్పుడు అజయ్ దేవగణ్ సరసన ‘దే దే ప్యార్ దే 2’ సినిమాలో నటిస్తున్నారు. 


More Telugu News