మమ్మల్ని శత్రువుల్లా చూశారు: మోహన్ లాల్

  • 'అమ్మ' అధ్యక్ష పదవికి రాజీనామాపై తొలిసారి స్పందించిన మోహన్‌లాల్
  • నన్ను, నా కమిటీ సభ్యులను శత్రువుల్లా చూశారని ఆవేదన
  • అలా ఎందుకు చేశారో ఇప్పటికీ అర్థం కాలేదన్న మలయాళ స్టార్
మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులపై ప్రముఖ నటుడు మోహన్‌లాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన కార్యవర్గ సభ్యులను చాలామంది శత్రువుల్లా చూశారని, ఆ కారణంగానే అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన తొలిసారిగా మనసు విప్పారు.

ఇటీవల ఈ విషయంపై మాట్లాడిన మోహన్‌లాల్, "అధ్యక్షుడు అనేది కేవలం ఒక పదవి మాత్రమే. ఏదైనా సమస్య తలెత్తితే దానికి ఒక్క అధ్యక్షుడే ఎలా బాధ్యుడు అవుతాడు? చాలామంది నాపై శత్రుత్వాన్ని పెంచుకున్నారు. నన్ను ఎందుకు శత్రువులా చూశారో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. అలాగని అందరూ నన్ను ద్వేషించారని చెప్పడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు రాజీనామా చేసిన సభ్యులు తిరిగి కమిటీలోకి వస్తారా లేదా అన్నది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం, ‘అమ్మ’ నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన శ్వేతా మేనన్‌పై మోహన్‌లాల్ ప్రశంసలు కురిపించారు. "శ్వేతా మేనన్‌ను అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం గొప్ప విషయం. గతంలో మహిళలు చర్చించడానికి సంకోచించిన ఎన్నో విషయాలను ఇప్పుడు ధైర్యంగా మాట్లాడవచ్చు. 'అమ్మ'కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది" అని ఆయన తెలిపారు.

'అమ్మ' నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు యువ నటులు ఎందుకు ముందుకు రావడం లేదన్న ప్రశ్నకు మోహన్‌లాల్ బదులిస్తూ, "మనం అనుకుంటే సరిపోదు, వారు కూడా బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. బహుశా వారికి ఆ సహనం లేదేమో" అని అభిప్రాయపడ్డారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులు లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ గతేడాది నివేదిక ఇవ్వడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక నేపథ్యంలోనే అప్పటి 'అమ్మ' అధ్యక్షుడు మోహన్‌లాల్‌తో పాటు 17 మంది సభ్యులు ఉన్న మొత్తం పాలక మండలి తమ పదవుల నుంచి వైదొలిగింది.



More Telugu News