ఎన్డీయే కూటమి ఎంపీలతో మోదీ సమావేశం

  • ఎన్డీఏ ఎంపీలు స్వదేశీ మేళాలను నిర్వహించాలన్న ప్రధాని మోదీ
  • ఆత్మనిర్భర్ భారత్ స్పూర్తిని ముందుకు తీసుకువెళ్లాలన్న మోదీ
  • జీఎస్టీపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ప్రధాని మోదీ
ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిన్న ఎన్డీఏ మిత్రపక్షాల ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. మన దేశ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎన్డీఏ ఎంపీలు స్వదేశీ మేళాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. భారతదేశం సవాళ్లను అధిగమించి ఎదిగేందుకు దేశం స్వయం సమృద్ధిని సాధించడం కీలకమని అన్నారు. భారత్ పై అమెరికా సుంకాల మోత మోగిస్తున్న వేళ ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

అమెరికా వంటి దేశాలు సుంకాలు విధించడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నా, మనం వెనక్కి తగ్గకూడదు. ఇలాంటి సందర్భాల్లో ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి,’’ అని వ్యాఖ్యానించారు.

భారత్‌ను ఆత్మనిర్భర్ (స్వయం సమృద్ధి) మార్గంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మన దేశ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎన్డీయేకు చెందిన పార్లమెంట్ సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో 'స్వదేశీ మేళాలు' నిర్వహించాలని ఆయన సూచించారు.

ప్రధాని మోదీ చేసిన కీలక సూచనలు ఇవే:

* స్వదేశీ ఉత్పత్తుల ప్రదర్శనకు మేళాలు నిర్వహించండి: పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా స్వదేశీ మేళాలు నిర్వహించాలన్నారు. ఇందులో స్థానికంగా తయారయ్యే వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని ఎంపీలను ఆదేశించారు.

జీఎస్టీపై ప్రజలలో అవగాహన కల్పించండి:

జీఎస్టీ సంస్కరణలు, వాటి ప్రయోజనాల గురించి ప్రజలతో చర్చించాలన్నారు. వ్యాపారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ విధానాలపై స్పష్టత కల్పించాలన్నారు.

దేశీయ తయారీకి పట్టం కట్టాలి:

విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ తయారీని ప్రోత్సహించాల్సిన అవసరముందని మోదీ స్పష్టం చేశారు. చిన్న పరిశ్రమలకు, యువ పారిశ్రామికవేత్తలకు వేదిక కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు ఉండాలన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అనంతరం ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను మీడియాకు వెల్లడించారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎంపీలంతా సరిగ్గా ఓటు వేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. పార్లమెంట్ సభ్యులే తప్పు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుందన్నారు. 


More Telugu News