ఏపీకి సినిమా పరిశ్రమ తరలిరావాలి .. ఎందుకంటే ..? మంత్రి కందుల దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు

  • తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చే ఆదాయంలో 60 శాతం ఏపీ నుండే నన్న మంత్రి కందుల దుర్గేశ్
  • ఎక్కువ శాతం షూటింగ్‌లు ఏపీలోనే జరుగుతున్నాయన్న మంత్రి దుర్గేశ్
  • నవంబర్ నెలలో రాజమండ్రిలో నంది నాటకోత్సవాలు నిర్వహిస్తామన్న మంత్రి దుర్గేశ్
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన అవసరం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ రాజకీయ నాయకులు హరిరామ జోగయ్య నేతృత్వంలో జాతీయ తెలుగు సారస్వత మండల పరిషత్ ఆధ్వర్యంలో పాలకొల్లులో జరుగుతున్న 4వ లఘు చిత్రాల పోటీల్లో మంత్రి కందుల దుర్గేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అవార్డులు ప్రదానం చేశారు. జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందిన డైరెక్టర్ బి.గోపాల్, హాస్యభరిత చిత్రాలు నిర్మించిన దర్శకులు రేలంగి నరసింహరావును, అవార్డులు పొందిన పలువురిని మంత్రి దుర్గేశ్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా సామాజిక దృక్పథంతో తీసిన లఘుచిత్రాలను మంత్రి దుర్గేశ్ ప్రశంసిస్తూ, చిత్ర పరిశ్రమ ఏపీకి రావాల్సిన అవసరాన్ని, సినిమా పరిశ్రమ పరిణామక్రమాన్ని వివరించారు. తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చే ఆదాయంలో 60 శాతం ఆంధ్రప్రదేశ్ నుండే వెళ్తుందని, 40 శాతం మాత్రమే తెలంగాణ నుండి వెళ్తుందని పేర్కొన్నారు. ఎక్కువ శాతం షూటింగ్‌లు ఏపీలోనే జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే సినిమా పరిశ్రమ ఏపీకి తరలిరావాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో పాలకొల్లు, రాజమహేంద్రవరంలో కళారంగానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

క్షీరపురిగా ఉంటూ పాలకొల్లుగా మారిన ఈ ప్రాంతం నుండి అనేక మంది లబ్దప్రతిష్టులు, కళాకారులు వచ్చారని మంత్రి దుర్గేశ్ అన్నారు. అద్భుత ప్రకృతి సౌందర్య ప్రాంతంగా ఉన్న గోదావరిలో వేలాదిగా సినిమా షూటింగ్‌లు జరిగాయని గుర్తు చేశారు. ఎంతోమంది దర్శకులు గోదావరి పరివాహక ప్రాంతాన్ని సెల్యూలాయిడ్ మీదికి తీసుకువచ్చి మరింత ప్రాచుర్యం కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు.

ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ పెట్టాలన్న హరిరామ జోగయ్య చిరకాల వాంఛను పరిగణలోకి తీసుకొని సాధ్యాసాధ్యాలను పరిశీలించి నెరవేర్చేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇందుకు కావాల్సిన ప్రభుత్వ సహకారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతిభ కల కళాకారులను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. కళలకు కాణాచి రాజమహేంద్రవరం అని చెబుతూ కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలను, రాష్ట్ర కళా, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.

నవంబర్‌లో నంది నాటకోత్సవాలు

అతి త్వరలోనే నంది అవార్డులు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి దుర్గేశ్ తెలిపారు. నవంబర్‌లో నంది నాటకోత్సవాలను రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసి జాతీయ రంగ స్థల పాఠశాల (నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా) బ్రాంచ్ ను ఏపీకి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఇందుకు ఆయన సూత్రప్రాయంగా అంగీకరించినట్లు మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. అతి త్వరలోనే ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను తీసుకొచ్చి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా నాటక రంగంలోని ఔత్సాహిక కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.

మంత్రి నిమ్మల రామనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహరావు, వీరశంకర్, విఎన్ ఆదిత్య, బీవీఎస్ రవి, సినీ గేయ రచయిత సిరాశ్రీ, ముఖ్య సమన్వయకర్తగా రాజా వన్నెంరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులుగా డాక్టర్ కేసిరాజు రాంప్రసాద్ వ్యవహరించారు. 


More Telugu News