రేపు ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్‌ భేటీ.. నేటి రాత్రే ఢిల్లీకి పయనం

  • మర్యాదపూర్వకంగానే ప్రధానితో సమావేశం
  • భేటీ అనంతరం రేపు మధ్యాహ్నం రాష్ట్రానికి తిరుగుపయనం
  • అమరావతిలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి
  • 'ఎక్స్' వేదిక‌గా జీఎస్టీ సంస్కరణలను స్వాగతించిన‌ లోకేశ్‌
ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ భేటీ కోసం మంత్రి లోకేశ్ ఈరోజు రాత్రే ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్‌ జరపనున్న ఈ సమావేశం పూర్తిగా మర్యాదపూర్వక భేటీ అని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో ప్రధానితో సమావేశం ముగిసిన వెంటనే మంత్రి లోకేశ్‌ తిరిగి రాష్ట్రానికి పయనం కానున్నారు. రేపు మధ్యాహ్నానికల్లా ఆయన రాష్ట్రానికి చేరుకుంటారని సమాచారం. అనంతరం ఆయన నేరుగా అమరావతిలో జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 

జీఎస్టీ చారిత్రాత్మక సంస్కరణలను స్వాగతిస్తున్నాం: మంత్రి లోకేశ్‌
జీఎస్టీలో భాగంగా ఇప్పటివరకు ఉన్న నాలుగు శ్లాబులను రెండుకు కుదించడం, నిత్యావసరాలపై పన్ను రేట్లను తగ్గించడం వంటివి వృద్ధికి దోహదపడే సానుకూల నిర్ణయాలని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ సంస్కరణలు దేశ పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేస్తాయని ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆయన కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యంగా పెన్సిళ్లు, షార్ప్‌నర్‌లు, వ్యాయామ పుస్తకాలు (ఎక్సర్‌సైజ్ బుక్స్), మ్యాపులు, చార్టుల వంటి వాటిపై జీఎస్టీ తగ్గించడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయం విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంతో ఊరటనిస్తుందని అన్నారు. ఇలాంటి చర్యలు విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సరళమైన, వృద్ధికి అనుకూలమైన పన్నుల విధానాన్ని తీసుకొచ్చినందుకు ప్రధాని మోదీని ఆయన ప్రశంసించారు.


More Telugu News