కనీసం ఒక యూరియా బస్తా అందించలేరా?... చంద్రబాబు సర్కారుపై జగన్ ఫైర్

  • ఏపీలో యూరియా కొరత తీవ్రంగా ఉందంటూ జగన్ ట్వీట్
  • చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు
  • బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు ఎరువుల అమ్ముతున్నారని ఆరోపణ
రాష్ట్రంలో యూరియా కొరత నెలకొందని, రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 'భవిష్యత్తుకు గ్యారెంటీ' అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం... రైతులకు కనీసం ఒక యూరియా బస్తాను కూడా అందించలేని దుస్థితిలో ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతులు యూరియా బస్తా కోసం రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడిందని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎరువుల కష్టాలు తప్పడం లేదని మండిపడ్డారు. ఇదే సమయంలో ఉల్లి, చీనీ, మినుము వంటి పంటల ధరలు కూడా పతనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నా, ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమని అన్నారు.

రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెట్ నడుస్తోందని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రూ. 267లకే దొరకాల్సిన యూరియా బస్తాను ప్రైవేటు వ్యాపారులు అక్రమంగా నిల్వ చేసి, రూ. 200లు అదనంగా వసూలు చేస్తూ అమ్ముకుంటున్నారని తెలిపారు. అక్రమ నిల్వలపై ఎలాంటి తనిఖీలు లేవని, బాధ్యులపై చర్యలు శూన్యమని విమర్శించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు భరోసా కేంద్రాలకు సరైన కేటాయింపులు జరపకపోవడమే ఈ సంక్షోభానికి కారణమని ఆరోపించారు.

తమ ప్రభుత్వ హయాంలో రైతులకే నేరుగా ఆర్‌బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేశామని జగన్ గుర్తుచేశారు. మార్కెట్ ధర కంటే రూ. 50 తక్కువకే రైతులకు అందించామని, ప్రస్తుత ప్రభుత్వం ఆ పనిని ఎందుకు చేయలేకపోతోందని ఆయన సూటిగా ప్రశ్నించారు.


More Telugu News