ఎన్ని కుట్రలు జరిగినా కేసీఆర్ నిప్పులా బయటకు వస్తారు: పద్మా దేవేందర్ రెడ్డి

  • కేసీఆర్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న పద్మా దేవేందర్ రెడ్డి
  • ఘోష్ కమిటీ నివేదిక చెత్తబుట్టలోదేనన్న మాటే నిజమైందని వ్యాఖ్య
  • క్రమశిక్షణ ఉల్లంఘన వల్లే కవితపై సస్పెన్షన్ వేటు అన్న పద్మ
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేయడంతో న్యాయమే గెలిచిందని ఆమె అన్నారు. మెదక్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఘోష్ కమిటీ నివేదికలో పసలేదని, అది కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు అనుగుణంగా ఉందని న్యాయస్థానమే తేల్చి చెప్పిందని పద్మా దేవేందర్ రెడ్డి గుర్తుచేశారు. "తెలంగాణ ప్రజల కోసం ఒక యజ్ఞంలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్, భవిష్యత్తులో ఎన్ని కుట్రలు జరిగినా, సీబీఐ విచారణ వేసినా నిప్పులా బయటకు వస్తారు. కాంగ్రెస్ కుట్రలను తప్పకుండా ఛేదిస్తారు" అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయని, వాటిని కేసీఆర్, హరీశ్ రావు కమిటీ ముందు ఉంచి తమ వాదనలు వినిపించారని తెలిపారు.

ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌పై కూడా పద్మా దేవేందర్ రెడ్డి స్పందించారు. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగ లేఖ ద్వారా వెల్లడించడం క్రమశిక్షణా రాహిత్యమేనని అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందునే, సొంత బిడ్డ అని కూడా చూడకుండా కేసీఆర్ కవితపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. "పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎవరికైనా చర్యలు తప్పవని కేసీఆర్ స్పష్టమైన సందేశం పంపారు. ఈ నిర్ణయాన్ని మేమంతా స్వాగతిస్తున్నాం" అని ఆమె వివరించారు. కేసీఆర్ లక్ష్య సాధనకు పార్టీ శ్రేణులంతా అండగా నిలుస్తామని ఆమె స్పష్టం చేశారు. 


More Telugu News