కర్నూలులో ఒకే రోజు రెండు హత్యలు

  • కర్నూలు ఎన్ఆర్‌పేటకు చెందిన బంగారు వ్యాపారి ఇజ్‌హర్ అహ్మద్‌పై కత్తులతో దుండగులు దాడి
  • సాయివైభవ్‌ నగర్‌లో వృద్ధురాలు కాటసాని శివలీలను హత్య చేసిన దుండగులు
  • వృద్ధురాలి ఒంటిపై బంగారు అభరణాలు చోరీ
  • కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కర్నూలు నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న రెండు హత్యలు నగరవాసుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి. ఒకవైపు బంగారు షాపు యజమాని షేక్ ఇజ్‌హర్ అహ్మద్‌పై దుండగులు కత్తులతో దాడి చేయగా, మరొకవైపు వృద్ధురాలు శివలీలను హత్య చేసి బంగారు ఆభరణాలు అపహరించిన ఘటనలు కలకలం సృష్టించాయి.

బంగారు షాపు యజమానిపై కత్తులతో దాడి – పాత వైరం కారణమా?

ఎన్‌ఆర్‌పేటకు చెందిన షేక్ ఇజ్‌హర్ అహ్మద్‌ (42) నగరంలో బంగారు వ్యాపారిగా కొనసాగుతున్నారు. సోమవారం సాయంత్రం రాధాకృష్ణ టాకీస్ సమీపంలోని మసీదు వద్ద ప్రార్థనల అనంతరం బయటకు వచ్చిన ఆయనపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ముఖం, ఛాతీపై విచక్షణారహితంగా పొడవడంతో పాటు, కుడి చేతిని పూర్తిగా నరికి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఇజ్‌హర్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఇజ్‌హర్‌కు ఇటీవల పాతబస్తీలోని ఘనిగల్లీకి చెందిన మాజీ కార్పొరేటర్ కుమారులు ఇమ్రాన్, ఇర్ఫాన్‌లతో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు వారి ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వృద్ధురాలిపై దాడి – ఆభరణాలతో పరార్

గణేశ్‌నగర్ పరిధిలోని సాయివైభవ్‌ నగర్‌లో నివాసముండే 75 ఏళ్ల వృద్ధురాలు కాటసాని శివలీలను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి బంగారు ఆభరణాలు అపహరించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె తలపై గట్టిగా కొట్టి చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

శివలీల భర్త సాంబశివారెడ్డి కొంత కాలం క్రితం మరణించగా, కుమారుడు గంగాధర్ రెడ్డి అమెరికాలో ఉంటున్నారు. దీంతో విశ్రాంత ఉద్యోగి అయిన అల్లుడు చంద్రశేఖర్ రెడ్డి ఆమెకు తోడుగా ఉంటున్నారు.

అల్లుడు చంద్రశేఖర్‌రెడ్డి నిన్న ఇంటికి వచ్చేసరికి ఆమె డైనింగ్ హాలులో రక్తపు మడుగులో పడి ఉండటం గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. శరీరంపై గాయాలు, మెడలో గొలుసు, చేతికి బంగారు గాజులు లేకపోవడంతో ఇది దొంగతనం నిమిత్తం చేసిన హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. శివలీల కుడి చెవి వెనుక భాగంలో పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు గుర్తించారు.

ముమ్మరంగా పోలీసు చర్యలు

ఈ రెండు సంఘటనలపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ బాబూప్రసాద్, మూడో పట్టణ సీఐ శేషయ్య తదితరులు ఘటనా స్థలాలను సందర్శించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


More Telugu News