పాత కారులోనే తిరిగిన కోడి రామకృష్ణ .. కారణం ఇదేనట!

  • దర్శకుడిగా వెలిగిన కోడి రామకృష్ణ 
  • ఆయన కెరియర్లో ఎన్నో సూపర్ హిట్లు 
  • పాత కారు మార్చని దర్శకుడు 
  • విలాసాలు అలవాటు కాకూడదనే ఆలోచన
       
కోడి రామకృష్ణ .. ఒకానొక సమయంలో టాలీవుడ్ సినిమాలను పరిగెత్తించిన స్టార్ డైరెక్టర్. తెలుగులో రాఘవేంద్రరావు .. దాసరి నారాయణరావు తరువాత కనిపించే పేరు ఆయనదే. తెలుగు కథకు భారీ గ్రాఫిక్స్ ను పరిచయం చేసిన దర్శకుడు ఆయనేనని చెప్పుకోవచ్చు. 100కి పైగా సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా ఆయనకి మంచి పేరు వుంది. అలాంటి కోడి రామకృష్ణ గురించి, తాజాగా 'తెలుగు వన్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు - దర్శకుడు దేవి ప్రసాద్ ప్రస్తావించారు. 

" నేను కోడి రామకృష్ణగారి శిష్యుడిని .. ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్టుమెంటులో పనిచేశాను. ఆయన 50 సినిమాలు పూర్తి చేసే సమయానికి కూడా ఒక చిన్న పాత కార్లో తిరుగుతూ ఉండేవారు. అప్పటికే ఆయన చాలా హిట్స్ ఇచ్చి ఉన్నారు. ఒకసారి ఒకాయన ఆయనతో "ఏంటి సార్ .. మీరు ఎన్నో హిట్స్ ఇచ్చారు .. చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అయినా ఇంత పాత కారులో తిరుగుతున్నారు? ఒకటి రెండు హిట్స్ ఇచ్చిన వాళ్లు పెద్ద పెద్ద లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు .. కారు మార్చండి సార్ " అని అన్నాడు. 

అందుకు కోడి రామకృష్ణ గారు స్పందిస్తూ .. "కారు కొనడం పెద్ద విషయం కాదు. కొన్న తరువాత మన జీవితం దానికి అలవాటు పడిపోతుంది. ఇక ఈ రోజు నుంచి మనకి రూపాయి రాదు అనే పరిస్థితి వచ్చినా, మనం కారును కంటిన్యూ చేయగలగాలి. అలాంటప్పుడు మాత్రమే కారు కొనాలి. ఇదే లగ్జరీ పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. రేపటి రోజున కారు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. నేలమీద నడిస్తే పడిపోవడం తక్కువ .. నాకు నేల మీద నడవడమే ఇష్టం అని అన్నారు" అంటూ కోడి రామకృష్ణ వ్యక్తిత్వాన్ని గురించి చెప్పారు.



More Telugu News