కోనసీమకు కేరళ కళ... పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం: మాధవ్

  • కోనసీమకు రైల్వే లైన్ లేకపోవడం చాలా దురదృష్టకరమన్న మాధవ్
  • బాలయోగి హయాంలోనే రైల్వే లైన్‌కు సర్వే జరిగిందని వెల్లడి
  • టెంపుల్ టూరిజం అభివృద్ధిపై దేవాదాయశాఖ దృష్టి పెట్టాలని సూచన
కోనసీమ ప్రాంతాన్ని పర్యాటకంగా కేరళ తరహాలో అభివృద్ధి చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ స్పష్టం చేశారు. ఈరోజు అమలాపురంలో జరిగిన 'చాయ్ పే చర్చ', పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కోనసీమ సహజ సౌందర్యాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కోనసీమకు ఇప్పటికీ రైల్వే లైన్ సౌకర్యం లేకపోవడం అత్యంత దురదృష్టకరమని మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో లోక్‌సభ స్పీకర్‌గా బాలయోగి ఉన్న సమయంలోనే రైల్వే లైన్ కోసం సర్వే జరిగిందని ఆయన గుర్తుచేశారు. కొంకణ్ రైల్వే తరహాలో ఇక్కడ కూడా అభివృద్ధి పనులు చేపడితే ఈ ప్రాంతం అన్ని విధాలా ముందుకు వెళుతుందని ఆయన అన్నారు.

అలాగే, రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధిపై దేవాదాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని మాధవ్ సూచించారు. దేశ ప్రజలంతా 'ఆత్మనిర్బర్ భారత్' లక్ష్యం దిశగా అడుగులు వేయాలని, స్వదేశీ వస్తువుల కొనుగోలును ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆటో కార్మికులను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన భరోసా ఇచ్చారు.


More Telugu News