యూరియా బ్లాక్ మార్కెట్ దందా జరుగుతోంది: ప్రభుత్వంపై కాకాని తీవ్ర ఆరోపణలు

  • కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించిందన్న కాకాని
  • రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోంది
  • బస్తాకు రూ.200 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపణ
రాష్ట్రంలో యూరియాకు తీవ్ర కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముకుంటున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బస్తాకు రూ. 200 వరకు అదనంగా వసూలు చేస్తూ వ్యాపారులు రైతులను దోచుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు.

రైతులు ఎండనకా వాననకా యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందని కాకాని ఆవేదన వ్యక్తం చేశారు. "బూస్టర్ డోస్ సమయంలో యూరియా అందకపోతే పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ ప్రభుత్వం ముడుపులు తీసుకుని ప్రైవేట్ వ్యక్తులకు యూరియాను కట్టబెట్టింది" అని ఆయన ఆరోపించారు. ఒకసారి ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, మరోసారి కొరత ఉందని చెబుతూ ప్రభుత్వం పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తోందని దుయ్యబట్టారు. అసలు ఏ హోల్‌సేల్ వ్యాపారులకు ఎరువులు సరఫరా చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల వేషాలు వేసి, సెట్టింగులు ఏర్పాటు చేసుకుని మాట్లాడటం తప్ప అన్నదాతలకు చేసిందేమీ లేదని కాకాని విమర్శించారు. "రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోతే కనీసం సమీక్షలు నిర్వహించిన పాపాన పోలేదు. ఇది రైతుల గురించి ఆలోచించని దుర్మార్గమైన ప్రభుత్వం" అని అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులకు అండగా నిలిచామని, ధరల స్థిరీకరణ నిధితో ఆదుకున్నామని గుర్తు చేశారు. కానీ నేటి కూటమి ప్రభుత్వంలో నేతలు దోచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇతరుల పథకాలను కాపీ కొట్టడం మినహా చంద్రబాబుకు కొత్తగా ఆలోచించడం తెలియదని కాకాని ఎద్దేవా చేశారు. 


More Telugu News