నోరా ఫతేహీలా ఉండాలని భార్యకు చిత్రహింసలు.. రోజుకు 3 గంటలు వర్కౌట్లు.. చేయకపోతే రోజుల తరబడి పస్తులు

  • పెళ్లికి రూ.77 లక్షల కట్నం ఇచ్చినా ఆగని వేధింపులు
  • బలవంతంగా అబార్షన్ పిల్‌ ఇచ్చి గర్భస్రావానికి కారణ‌మైన భ‌ర్త‌
  • భర్త, అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
  • భర్తకు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని బాధితురాలి ఆరోపణ 
ప్రముఖ బాలీవుడ్ నటి నోరా ఫతేహీలా తన భార్య ఉండాలన్న విపరీతమైన కోరికతో ఓ భర్త ఆమెను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశాడు. అందంగా లేవంటూ, లావుగా ఉన్నావంటూ నిత్యం వేధిస్తూ, గంటల తరబడి వ్యాయామం చేయమని బలవంతం చేశాడు. అంతటితో ఆగకుండా, ఆమె గర్భం దాల్చితే బలవంతంగా అబార్షన్ చేయించి చివరకు ఇంటి నుంచి గెంటేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.

బాధితురాలు షాను (26) కథనం ప్రకారం, ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేస్తున్న శివమ్ ఉజ్వల్‌తో ఆమెకు ఈ ఏడాది మార్చి 6న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో షాను కుటుంబం నగదు, నగలు, స్కార్పియో కారు రూపంలో సుమారు రూ. 77 లక్షల కట్నం ఇచ్చింది. అయినప్పటికీ, పెళ్లయిన కొన్ని రోజులకే అత్తింటివారి అసలు స్వరూపం బయటపడింది. నోరా ఫతేహీలా నాజూకైన శరీరాకృతి కావాలంటూ భర్త ఆమెను రోజుకు మూడు గంటల పాటు వ్యాయామం చేయమని ఒత్తిడి చేసేవాడు. ఏదైనా కారణంతో వ్యాయామం చేయకపోతే రోజుల తరబడి భోజనం పెట్టకుండా మాడ్చేసేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

తన భర్తకు ఇతర మహిళల పట్ల ఆసక్తి ఎక్కువని, తరచూ వారి అసభ్యకర వీడియోలు చూసేవాడని షాను ఆరోపించింది. చిన్న చిన్న విషయాలకే భర్త చేయి చేసుకునేవాడని, అత్తింటివారు అతడినే సమర్థించేవారని వాపోయింది. తన మామ కేపీ సింగ్ ఎలాంటి సమాచారం లేకుండా తమ బెడ్‌రూమ్‌లోకి వచ్చేవాడని, ఇది తనకు తీవ్ర ఇబ్బందిగా ఉండేదని పేర్కొంది.

ఈ క్రమంలో తాను గర్భం దాల్చిన విషయం చెప్పగా, అత్తింటివారు సంతోషించలేదని షాను తెలిపింది. కొన్ని రోజుల తర్వాత, ఆడపడుచు రుచి ఓ మాత్ర ఇచ్చి బలవంతంగా మింగించిందని, ఇంటర్నెట్‌లో వెతకగా అది అబార్షన్ పిల్‌ అని తెలిసిందని ఆమె చెప్పింది. ఆ తర్వాత పెరుగులో మసాలాలు కలిపి తినిపించడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురై, జులై 9న ఆసుపత్రికి వెళ్లగా గర్భస్రావం జరిగిందని వైద్యులు నిర్ధారించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

జూన్ 18న షాను తల్లిదండ్రులు ఆమెను పుట్టింటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత జులై 26న తిరిగి అత్తింటికి వెళ్లగా, ఇంట్లోకి రానివ్వకుండా గెంటేశారు. తన వస్తువులు, నగలు కూడా తిరిగివ్వలేదని చెప్పింది. దీంతో విసిగిపోయిన షాను, ఈ నెల‌ 14న భర్త శివమ్, అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, గృహ హింస, గర్భస్రావానికి కారకులయ్యారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News