నేరస్థులు రాజకీయ ముసుగు వేసుకున్నారు.. వైసీపీపై మంత్రి నిమ్మల ఫైర్

  • సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం
  • ప్రతిపక్ష హోదా రానీ ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని ఎద్దేవా
ఆంధ్రప్రదేశ్ లో కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారానికి దిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా అమరావతి కొట్టుకుపోతుందని, బెజవాడ మునిగిపోతుందని పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమలో రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయని, చంద్రబాబు సారథ్యంలో వాటర్ మేనేజ్మెంట్, ఫ్లడ్ మేనేజ్మెంట్ తో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో అభివృద్ధి పనులు కొనసాగితే తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందనే భయాందోళనలతో వైసీపీ నేతలు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నేరస్థులు రాజకీయ ముసుగు ధరించి పార్టీని నడుపుతున్నారని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా కూడా రాని ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని ఎద్దేవా చేశారు. భారతీయులంతా పండుగలా జరుపుకునే ఆగస్టు 15 వేడుక రోజు జాతీయ జెండాను కూడా ఎగరవేయకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ వింత పోకడలకు తెరలేపారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.


More Telugu News