తాడిపత్రికి వెళ్లకుండా పెద్దారెడ్డిని మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు!

  • హైకోర్టు ఆదేశాలున్నా పెద్దారెడ్డిని అనుమతించని పోలీసులు
  • హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన పోలీసులు!
  • తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పట్టణంలోకి అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఈ ఆధిపత్య పోరు ఈరోజు నాటకీయ పరిణామాలకు వేదికైంది.

ఈరోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పోలీసు బందోబస్తుతో కేతిరెడ్డిని తాడిపత్రికి చేర్చాలని హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తిమ్మంపల్లి నుంచి పట్టణంలోకి వస్తున్న ఆయనను పోలీసులు మార్గమధ్యంలోనే నిలిపివేశారు. కేతిరెడ్డి కోర్టు ఉత్తర్వులను చూపించినా, ఉన్నతాధికారుల నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు రాలేదని చెప్పి పోలీసులు అనుమతించలేదు.

మరోవైపు, కేతిరెడ్డి ప్రవేశాన్ని అడ్డుకునే వ్యూహంలో భాగంగా మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టణంలో శివుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టినట్టు భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా అనుచరులు, కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో ఇరువర్గాలు ఎదురుపడితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే ముందుజాగ్రత్త చర్యగా పట్టణంలో భారీగా పోలీసులను మోహరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద కూడా బలగాలను ఏర్పాటు చేశారు.

మరోవైపు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తాడిపత్రి పోలీసులు సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ పిటిషన్ కారణంగానే కేతిరెడ్డిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. మొత్తంమీద, కోర్టు ఆదేశాలు, రాజకీయ వ్యూహాల నడుమ తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. 


More Telugu News