కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ

  • ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాల‌ని విజ్ఞ‌ప్తి
  • ఇటీవల ఏపీ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన వివరాలను మంత్రికి తెలియ‌జేసిన లోకేశ్‌
  • ఏపీ అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి వివర‌ణ‌
ఏపీ నుంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో ఈ రోజు కేంద్ర విదేశాంగశాఖ మంత్రితో లోకేశ్‌ భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... విశాఖపట్నంలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని చెప్పారు. దీనికి సహకారం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలని, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల‌న్నారు. ఏపీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

వలస కార్మికులకు ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులతో పాటు నిధులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేశ్‌ కోరారు. ఇటీవల సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన వివరాలు..  వివిధ రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వంతో జరిగిన చర్చల గురించి లోకేశ్‌ వివరించారు. దీనికి మీ పూర్తి సహకారం కావాలని లోకేశ్ మంత్రి జైశంకర్‌ను కోరారు.

ఏపీకి చెందిన సుమారు 35 లక్షల మంది ప్రవాసాంధ్రులు విదేశాల్లో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నారు. అమెరికాలో 10 లక్షలు, గల్ఫ్ దేశాల్లో 8 లక్షలు, ఐరోపా దేశాల్లో 4 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారు. యూఎస్ లో అక్కడి ప్రజల తలసరి ఆదాయం 70 వేల‌ డాలర్లు కాగా, ప్రవాసాంధ్రుల తలసరి ఆదాయం 1,26,000  డాలర్లుగా ఉంద‌న్నారు.

ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, తైవాన్ లతో మొబిలిటీ, మైగ్రేషన్ (MMPA) భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడంలో కేంద్ర చర్యలు అభినందనీయమని, ప్రపంచ నైపుణ్య రాజధానిగా భారత్ ను తీర్చిదిద్దే ప్రయత్నాలకు ఏపీ పూర్తి మద్దతునిస్తుంద‌ని తెలిపారు. కార్మికుల భద్రత, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం, రాష్ట్రస్థాయిలో ఆయా ఒప్పందాలను అమలు చేయడంలో ఏపీ ముందంజలో ఉంటుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

స్కిల్ డెవలప్ మెంట్, ఇనిస్టిట్యూషనల్ పార్టనర్ షిప్స్ కోసం నైపుణ్య భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడంలో ఏపీ ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు. ఇందులో రష్యా, ఆస్టేలియా వంటి దేశాలతో కలిసి జాయింట్ ట్రైనింగ్ అండ్ ఎసెస్ మెంట్ పై ట్విన్నింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. వివిధ పారిశ్రామిక సంస్థలు, ఉద్యోగార్థులను అనుసంధానించే ఏకీకృత వేదికగా నైపుణ్యం పోర్టల్ ను త్వరలో ప్రారంభించబోతున్నామ‌ని తెలిపారు. నైపుణ్యం కలిగిన యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలను కల్పించడానికి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్జానాన్ని రప్పించడానికి జపాన్, కొరియా, తైవాన్లతో కలసి మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్ షిప్ అరేంజ్ మెంట్ (MMPA) ఉమ్మడి ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి సారించామ‌ని వివ‌రించారు. ఏపీ యువతకు మెరుగైన విదేశీ ఉద్యోగావకాశాల కల్పనకు కేంద్రం నుంచి రాష్ట్రానికి డేటా షేరింగ్ సహకారాన్ని అందించాల్సిందిగా కేంద్రమంత్రి జైశంకర్ కు మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.



More Telugu News