నోయిడాలో నకిలీ పోలీస్ స్టేషన్.. టీఎంసీ మాజీ నేత నిర్వాకం!

  • నకిలీ అంతర్జాతీయ పోలీస్ స్టేషన్ గుట్టురట్టు
  • తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత బివాస్ అధికారే సూత్రధారి
  • నకిలీ నోటీసులతో బెదిరించి డబ్బు వసూళ్లు
  • ఇప్పటికే బెంగాల్‌లో పలు స్కామ్‌లలో నిందితుడిగా ఉన్న అధికారి
  • నిందితుల నుంచి నకిలీ ఐడీ కార్డులు, నగదు స్వాధీనం
  • మోసాల్లో కీలక పాత్ర పోషించిన అధికారి కుమారుడు
పలు స్కామ్‌లలో ఆరోపణలు ఎదుర్కొంటూ పశ్చిమ బెంగాల్ నుంచి పారిపోయి వచ్చిన ఓ మాజీ రాజకీయ నేత, ఏకంగా నోయిడాలో నకిలీ అంతర్జాతీయ పోలీస్ స్టేషన్, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కార్యాలయాన్ని నడుపుతున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో సూత్రధారిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ నేత బివాస్ అధికారితో పాటు మరో నలుగురిని సోమవారం నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని వ్యక్తులకు అంతర్జాతీయ చట్టాల పేరిట నకిలీ నోటీసులు పంపి, భూవివాదాలు పరిష్కరిస్తామని, ప్రభుత్వ పనులు చేసి పెడతామని నమ్మించి ఈ ముఠా భారీగా డబ్బు వసూలు చేస్తోంది. ఈ మోసంలో బివాస్ అధికారి కుమారుడు కూడా పాల్గొన్నాడు. తమది నిజమైన దర్యాప్తు సంస్థ అని ప్రజలను నమ్మించేందుకు, ఇంటర్‌పోల్ స్టిక్కర్లు ఉన్న వాహనాలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. నిందితులు కార్యకలాపాలు సాగిస్తున్న భవనం నుంచి నకిలీ ఐడీ కార్డులు, సైన్ బోర్డులు, మొబైల్ ఫోన్లు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బివాస్ అధికారి గతంలో తృణమూల్ కాంగ్రెస్‌లో బీర్‌భూమ్ జిల్లా నల్హటి బ్లాక్ అధ్యక్షుడిగా పనిచేశారు. పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామకాల స్కామ్‌లో ఆయన పేరు బయటకు రావడంతో టీఎంసీ పార్టీ ఆయనతో సంబంధాలు తెంచుకుంది. ఆ తర్వాత ఆయన 'సర్వ వర్తీయ ఆర్య మహాసభ' అనే సొంత రాజకీయ పార్టీని కూడా స్థాపించారు.

అంతకుముందు కోల్‌కతాలోని బేలియాఘాట ప్రాంతంలో కూడా 'అంతర్జాతీయ పోలీస్, ఇన్వెస్టిగేషన్ బ్యూరో' పేరుతో కార్యాలయం తెరిచేందుకు అధికారి ప్రయత్నించగా, కోల్‌కతా పోలీసులు దానిని భగ్నం చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తన ఆశ్రమానికి పిలిపించి, ఇంటర్‌పోల్ అధికారిగా బెదిరించి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ఉపాధ్యాయ నియామకాల స్కామ్‌లో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ ఇప్పటికే అధికారి ఆశ్రమం, ఫ్లాట్‌లపై దాడులు చేసి ఆయనను విచారించాయి. ఈ కేసులో ఆయన ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. ఈ పాత కేసుల దర్యాప్తు ఆధారంగానే నోయిడాలో నడుపుతున్న నకిలీ పోలీస్ స్టేషన్ వ్యవహారం బయటపడినట్టు అధికారులు తెలిపారు.


More Telugu News