ఈడీ ఆఫీసుకు చేరుకున్న అనిల్ అంబానీ

  • మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు 
  • 7వేల కోట్ల మోసం కేసులో అధికారుల విచారణ
  • ఇటీవల అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసుల జారీ
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల నోటీసులపై రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఈ రోజు ఉదయం ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. మనీలాండరింగ్ కేసులో విచారణకు ఆయన హాజరయ్యారు. రూ.17వేల కోట్ల రుణ మోసాలతో పాటు మనీలాండరింగ్‌ కేసులో అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో అనిల్‌ అంబానీ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.

రిలయన్స్ గ్రూపు సంస్థలపై ఈడీ అధికారులు గత నెల 24న దాడులు చేశారు. మొత్తం 35 ప్రాంతాల్లోని 50 కంపెనీలలో మూడు రోజుల పాటు సోదాలు జరిపారు. పలు కీలక దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం అనిల్‌ అంబానీకి సమన్లు జారీ చేశారు. పలువురు ఎగ్జిక్యూటివ్‌లకు కూడా నోటీసులు పంపించారు. అనిల్‌ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు చేపట్టింది. ఇప్పటికే అనిల్‌ అంబానీ దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ చేసింది.


More Telugu News