మద్యం మత్తులో దొంగ.. చోరీ చేసిన ఇంట్లోనే నిద్ర.. లేచేసరికి చేతికి బేడీలు!

  • యూపీలోని కాన్పూర్‌లో విచిత్ర ఘటన
  • దొంగతనానికి వెళ్లిన ఇంట్లోనే నిద్రపోయిన దొంగ‌
  • మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్న వైనం
  • ఉదయాన్నే చూసి పోలీసులకు సమాచారమిచ్చిన ఇరుగుపొరుగు
  • దొంగ‌ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసిన పోలీసులు
దొంగతనం చేయడానికి వెళ్లిన ఓ దొంగను నిద్రమత్తు ఆవహించడంతో అక్కడే నిద్రపోగా, పోలీసులు వచ్చి అరెస్టు చేసిన విచిత్ర ఘటన ఇది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. 

వివరాల్లోకి వెళితే.. మరియంపూర్ రైల్వే లైన్ సమీపంలోని నజీరాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో సోదరులైన వినోద్ కుమార్, అనిల్ కుమార్ పక్కపక్కనే ఉన్న ఇళ్లలో నివసిస్తున్నారు. కాగా, మద్యం సేవించిన దొంగ అర్ధరాత్రి వేళ తొలుత వినోద్‌ ఇంట్లోకి చొరబడ్డాడు. అల్మారా లాకర్‌ను పగులగొట్టి విలువైన వస్తువులను దోచుకున్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న అనిల్ ఇంట్లోకి దొంగ ప్రవేశించాడు. అక్కడి అల్మారాను కూడా పగులగొట్టి అందులో ఉన్న నగలు, డబ్బు దొంగిలించాడు. మద్యం మత్తులో నిద్ర ముంచుకు రావడంతో ఆ ఇంటి లోపలున్న బెడ్‌పై అతడు నిద్రపోయాడు.

మరోవైపు, ఆటో నడిపే అనిల్‌ మరునాడు ఉదయం నిద్రలేచాడు. గుర్తు తెలియని వ్యక్తి తన ఇంట్లోని బెడ్‌పై నిద్రిస్తుండటం చూసి షాకయ్యాడు. ఇంట్లో చూడగా కబోర్డ్‌ విరిగి ఉంది. అందులోని విలువైన వస్తువులు కనిపించలేదు. నిద్రిస్తున్న వ్యక్తి వద్ద వెతకగా చోరీ చేసిన నగలు, డబ్బులు కనిపించాయి. ఇంతలో అతని అరువులు విన్న పక్కింటి వినోద్‌ భార్య కూడా నిద్రలేచింది. వారి ఇంట్లో కూడా చోరీ జరిగినట్లు ఆమె గ్రహించింది.

కాగా, ఈ రెండు కుటుంబాలు పొరుగువారిని అలెర్ట్‌ చేశారు. దీంతో ఆ దొంగను పట్టుకుని చితకబాది, నజీరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు దొంగను అరెస్టు చేసి, అతనిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.


More Telugu News