'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన హరీశ్ శంకర్

  • 'ఉస్తాద్ భగత్ సింగ్' లో ప‌వ‌న్‌కు సంబంధించిన‌ షెడ్యూల్ పూర్తి
  • సోషల్ మీడియాలో సెట్స్ నుంచి ఫొటో పంచుకున్న దర్శకుడు హరీశ్ శంకర్
  • పవన్ స‌ర‌స‌న‌ హీరోయిన్‌గా శ్రీలీల.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
  • 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్-హరీశ్ కాంబోలో వస్తున్న చిత్రం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో ప‌వ‌న్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ, సెట్స్ నుంచి తీసిన ఓ ఆసక్తికరమైన ఫొటోను పంచుకున్నారు. ఆయ‌న సపోర్ట్ వ‌ల్లే షూటింగ్ త్వ‌ర‌గా పూర్తయిన‌ట్లు హ‌రీశ్ పేర్కొన్నారు. 

"మాటిస్తే నిల‌బెట్టుకోవ‌డం, మాట మీదే నిల‌బ‌డ‌డం.. మీరు ప‌క్క‌న ఉంటే క‌రెంట్ పాకిన‌ట్లే. ఈ రోజు ఎప్ప‌టికీ గుర్తుంటుంది" అంటూ ప‌వ‌న్‌తో దిగిన ఫొటోను షేర్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక‌, ప‌వ‌న్ ఇటీవ‌ల 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అటు, సుజీత్‌తో చేస్తున్న ఓజీ కూడా ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 25న విడుద‌ల కానుంది. ఇలా ఒకే ఏడాదిలో రెండు సినిమాల‌తో అభిమాల‌ను ప‌వ‌ర్‌స్టార్ ఫుల్ ఖుషీ చేస్తున్నారు. 


More Telugu News