ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు.. భారత్‌కు 4 వికెట్లు... ఐదో రోజుకు చేరిన థ్రిల్లర్!

  • భారత్, ఇంగ్లండ్ ఐదో టెస్టులో తీవ్ర ఉత్కంఠ
  • వెలుతురు సరిగా లేకపోవడంతో ముందుగానే ముగిసిన నాలుగో రోజు ఆట
  • విజయానికి కేవలం 35 పరుగుల దూరంలో నిలిచిన ఇంగ్లండ్
  • జో రూట్, హ్యారీ బ్రూక్ అద్భుత శతకాలతో ఇంగ్లండ్‌కు భారీ భాగస్వామ్యం
  • చివర్లో వికెట్లు తీసి భారత్‌ను పోటీలో నిలిపిన ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదో టెస్టు ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ఇంగ్లండ్ విజయం ముంగిట నిలిచిన తరుణంలో వెలుతురు లేమి అడ్డంకిగా మారింది. దీంతో అంపైర్లు నాలుగో రోజు ఆటను ముందుగానే నిలిపివేయడంతో మ్యాచ్ ఫలితం ఆఖరి రోజుకు వాయిదా పడింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 35 పరుగులు అవసరం కాగా, భారత్ గెలవాలంటే 4 వికెట్లు పడగొట్టాలి.

374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ దాదాపు విజయాన్ని ఖాయం చేసుకున్నట్లే కనిపించింది. ముఖ్యంగా జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (111) అద్భుత శతకాలతో చెలరేగారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి భారత బౌలర్లను తీవ్రంగా పరీక్షించారు. వీరి దూకుడుతో ఇంగ్లండ్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దీంతో మ్యాచ్ ఏకపక్షంగా ముగుస్తుందని అంతా భావించారు.

అయితే, కీలక సమయంలో భారత బౌలర్లు పుంజుకున్నారు. తొలుత హ్యారీ బ్రూక్‌ను ఆకాశ్ దీప్ ఔట్ చేయగా, ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. ముఖ్యంగా, క్రీజులో పాతుకుపోయిన జో రూట్‌తో పాటు జాకబ్ బెథెల్‌ను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చడంతో భారత్ శిబిరంలో ఆశలు చిగురించాయి. రెండో ఇన్నింగ్స్‌లో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు.

నాలుగో రోజు ఆట 76.2 ఓవర్ల వద్ద ముగిసే సమయానికి జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (0) క్రీజులో ఉన్నారు. ఆఖరి రోజు ఇరు జట్లకు విజయావకాశాలు సమానంగా ఉండటంతో మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


More Telugu News