జర్నలిస్టు వాసుదేవన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం

  • జగన్‌ హత్యకు అమెరికా నుంచి 200 మంది షార్ప్ షూటర్లు వచ్చారన్న వాసుదేవన్
  • ఆయన వ్యాఖ్యలు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయన్న జనసేన నేత
  • ఆయన ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
  • నోటీసులు ఇచ్చేందుకు వెళ్తే కనిపించని జర్నలిస్ట్ వాసుదేవన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో జర్నలిస్టు పత్రి వాసుదేవన్‌పై పోలీసులు విచారణ ప్రారంభించారు. జూలై 20న ‘99 టీవీ’లో ప్రసారమైన ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్‌ను హత్య చేసేందుకు అమెరికా నుంచి 200 మంది షార్ప్ షూటర్లు వచ్చారని వాసుదేవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలతో ప్రజల్లో కలవరం నెలకొనడంతో గుంటూరుకు చెందిన జనసేన నాయకుడు యర్రంశెట్టి సాయినాథ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆయన ఫిర్యాదు ఆధారంగా నల్లపాడు పోలీసులు వాసుదేవన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయన వ్యాఖ్యల వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఎలాంటి ఆధారాలున్నాయో తెలుసుకోవడంపై దృష్టి సారించారు. అయితే ఈ వివాదం అనంతరం వాసుదేవన్ కనిపించకుండా పోవడం పోలీసులను గందరగోళంలోకి గురిచేస్తున్నది. ‘41ఏ’నోటీసు జారీ చేసేందుకు పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ఈ నేపథ్యంలో పోలీసులు 99 టీవీ యాజమాన్యాన్ని సంప్రదించి చానల్ సీఈవోతో పాటు ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల వాంగ్మూలం నమోదు చేశారు. వాసుదేవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని, ఆయన వద్ద ఉన్న సమాచారం గురించి తమకు తెలియదని చీఫ్ ఎడిటర్ భావనారాయణ స్పష్టం చేశారు. అయితే చానల్ తరఫుl వాసుదేవన్‌ను విచారణకు పంపుతామని తెలియజేసినప్పటికీ ఆయన ఇంకా హాజరు కాలేదు. ప్రస్తుతం వాసుదేవన్ అదృశ్యం కావడంతో పోలీసులు చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఆయన వ్యాఖ్యల వీడియోలు, గతంలో చేసిన విశ్లేషణలు తదితర ఆధారాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. 


More Telugu News