రూ. 5 కోట్ల మోసం కేసు.. త‌మిళ న‌టుడు అరెస్ట్

  • న‌టుడు ఎస్. శ్రీనివాసన్‌ను ఒక భారీ మోసం కేసులో  అరెస్ట్ 
  • రూ.1000 కోట్ల రుణం ఇప్పిస్తాన‌ని చెప్పి ఒక సంస్థ నుంచి రూ. 5 కోట్లు తీసుకుని మోసం
  • నిన్న చెన్నైలో అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
త‌మిళ న‌టుడు ఎస్. శ్రీనివాసన్‌ను ఒక భారీ మోసం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.1000 కోట్ల లోన్ ఇప్పిస్తాన‌ని చెప్పి ఒక సంస్థ నుంచి రూ. 5 కోట్లు తీసుకుని మోసం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు రావ‌డంతో అత‌డిని బుధవారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 2010లో ఓ సంస్థకు రూ.1000 కోట్లు రుణం ఇప్పిస్తాన‌ని శ్రీనివాస‌న్ హామీ ఇచ్చారు. దీనికి బ‌దులుగా.. వారి వ‌ద్ద నుంచి రూ.5 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. నెల రోజుల్లో లోన్ వ‌స్తుంద‌ని రాక‌పోతే డ‌బ్బులు తిరిగి ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. అడ్వాన్స్‌గా తీసుకున్న డ‌బ్బును వ్య‌క్తిగ‌త అవసరాల కోసంతో పాటు సినిమాల నిర్మాణానికి ఉప‌యోగించిన‌ట్లు స‌మాచారం. అయితే, నెలలు గ‌డిచినా రుణం మంజూరు కాక‌పోవ‌డంతో మోస‌పోయామ‌ని గుర్తించిన‌ సంస్థ యాజ‌మాన్యం పోలీసుల‌ను ఆశ్రయించింది. దీంతో ఢిల్లీ పోలీసులు శ్రీనివాస‌న్‌ను చెన్నైలో అరెస్టు చేశారు.  

ఇక‌, 2010లో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్రీనివాస‌న్ ఇప్ప‌టివ‌ర‌కు 60కి పైగా చిత్రాల్లో న‌టించారు. 2011లో వ‌చ్చిన ల‌థిక అనే మూవీలో హీరోగా క‌నిపించారు. కొన్ని సినిమాల‌కు ఆయ‌న నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. ఇలా ఒక‌వైపు సినిమాల్లో కొన‌సాగుతూనే చెన్నైలో ఓ ఫైనాన్స్ సంస్థ‌ను స్థాపించారు. ఆ సంస్థ పేరుతోనే ఈ భారీ మోసానికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది.   

అన్నట్టు... ఈ శ్రీనివాసన్ తమిళనాడులో తనను తాను పవర్ స్టార్ అని పిలుచుకుంటుంటాడు. 


More Telugu News