జీఎస్ఎల్‌వీ-ఎఫ్16 ప్రయోగం విజయవంతం.. స్పందించిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్

  • శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన తెలంగాణ కీలక నేతలు
  • అంతరిక్ష పరిశోధన ప్రయాణంలో కీలకమైన మైలురాయిగా నిలిచిపోతుందన్న సీఎం
  • నైసార్ గేమ్ ఛేంజర్ అవుతుందన్న బండి సంజయ్
జీఎస్ఎల్‌వీ-ఎఫ్16 ప్రయోగం విజయవంతం కావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయం భారత అంతరిక్ష పరిశోధన ప్రయాణంలో కీలకమైన మైలురాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నాసా సహకారంతో చేపట్టిన ఈ మిషన్ విజయం అంతరిక్ష పరిశోధన చరిత్రలో మహత్తరమైన ఘట్టమని ముఖ్యమంత్రి అన్నారు.

ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ - నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (నైసార్) ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ-ఎఫ్16 ప్రయోగం చారిత్రాత్మక పురోగతికి నిదర్శనమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నైసార్ ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ అంతర్జాతీయ సహకారంలో ముందడుగు అని, ఇందులో భారత శాస్త్రవేత్తల పనితీరు గర్వకారణమని కొనియాడారు.

జీఎస్ఎల్‌వీ-ఎఫ్16 ప్రయోగం విజయవంతం కావడంపై బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో, నాసా శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. జీఎస్ఎల్‌వీ-ఎఫ్16 ఉపగ్రహం యొక్క శక్తివంతమైన రాడార్ సాంకేతికతతో నైసార్ ప్రతి 12 రోజులకు మొత్తం భూగోళాన్ని స్కాన్ చేస్తుందని అన్నారు.

అధిక రిజల్యూషన్‌తో భూఉపరితలం మీద, మంచుతో కప్పబడిన ఉపరితలాలను, సముద్రాలను చిత్రీకరిస్తుందని వెల్లడించారు. భూమిపై మారుతున్న వాతావరణ పరిస్థితులు, సహజ విపత్తులను, అడవులను పర్యవేక్షించేందుకు ఈ ఉపగ్రహం సహాయపడుతుందని తెలిపారు. నైసార్ భూశాస్త్రానికి గేమ్ ఛేంజర్ అవుతుందని పేర్కొన్నారు.


More Telugu News