టీమిండియాకు ఊర‌ట‌.. పంత్ బ్యాటింగ్‌కు వ‌స్తాడ‌న్న కోచ్‌

  • మాంచెస్ట‌ర్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లండ్‌ నాలుగో టెస్టు 
  • తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డ పంత్‌
  • అయినా త‌ర్వాతి రోజు బ్యాటింగ్‌కు దిగి హాఫ్ సెంచ‌రీ బాదిన వైనం
  • ఆఖ‌రి రోజైన ఇవాళ కూడా పంత్ బ్యాటింగ్ చేస్తాడ‌న్న బ్యాటింగ్ కోచ్ సితాన్షు
మాంచెస్ట‌ర్ వేదిక‌గా జ‌రుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ఐదవ రోజు బ్యాటింగ్‌కు వ‌స్తాడని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపాడు. "రిషబ్ రేపు బ్యాటింగ్ చేస్తాడు" అని నాలుగో రోజు స్టంప్స్ తర్వాత కోటక్ పేర్కొన్నాడు. 

కాగా, రెండో రోజు బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో పంత్‌ కుడి పాదానికి తీవ్ర గాయ‌మైన‌ విష‌యం తెలిసిందే. అయినా త‌ర్వాతి రోజు పంత్ బ్యాటింగ్‌కు దిగి అర్ధ సెంచరీ సాధించాడు. కీపింగ్ బాధ్య‌త‌లు మాత్రం ధ్రువ్ జురెల్‌కు అప్ప‌గించ‌డం జ‌రిగింది. ఇవాళ కీల‌క‌మైన ఐదో రోజు పంత్ బ్యాటింగ్‌కు రావ‌డం అనేది భార‌త జ‌ట్టుకు ఊర‌ట‌నిచ్చే విష‌యం. 

ఇక‌, నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే భార‌త జ‌ట్టు కీల‌క‌మైన రెండు వికెట్లు కోల్పోయింది. పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డ్డ టీమిండియాను కేఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్ ద్వ‌యం ఆదుకుంది. అజేయంగా 174 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పిందీ జోడీ. 

నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లకు 174 పరుగులు చేసింది. ఇంకా ఇంగ్లండ్ కంటే భారత్ 137 పరుగులు వెనుకబడి ఉంది. ఐదో రోజు ఈ ద్వ‌యం ఎంత‌వ‌ర‌కు నిల‌బ‌డుతుందో చూడాలి. ఆ త‌ర్వాత వ‌చ్చే బ్యాట‌ర్లు కూడా క్రీజులో నిల‌బ‌డితేనే భార‌త్ మ్యాచ్‌ను డ్రా చేసుకోగ‌ల‌దు. ఇక‌, పంత్‌ కూడా బ్యాటింగ్‌కు దిగ‌డం కొంత‌మేర జ‌ట్టుకు క‌లిసిరానుంది.   


More Telugu News