హోంగార్డు ఎగ్జామ్‌ రాస్తూ స్పృహ కోల్పోయిన మహిళ.. ఆసుపత్రికి తీసుకెళ్తూ అంబులెన్స్‌లో ఇద్దరు అత్యాచారం

    
బీహార్‌లోని గయ జిల్లాలోని దారుణం జరిగింది. బోధ్‌గయ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎంపీ-3 పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన హోం గార్డ్ నియామక పరీక్షలో పాల్గొన్న ఓ మహిళ.. పరీక్ష సమయంలో స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్‌ కలిసి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ నెల 24న ఈ ఘటన జరగ్గా నిన్న వెలుగులోకి వచ్చింది. 

సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) ఆనంద్ కుమార్ కథనం ప్రకారం.. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్, టెక్నీషియన్ అజిత్ కుమార్‌లను రెండు గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని ఎస్ఎస్పీ తెలిపారు.  ఫాస్ట్-ట్రాక్ ట్రయల్ ద్వారా నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 


More Telugu News