'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'లో ఆ సీన్స్ క‌ట్‌.. భారీగా త‌గ్గిన సినిమా నిడివి

  • పవన్ క‌ల్యాణ్ హీరోగా 'హరిహర వీరమల్లు' 
  • నిన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సినిమా
  • మూవీలోని కొన్ని సీన్లపై ప్రేక్ష‌కులు పెద‌వి విరుపు
  • ద్వితీయార్థంలో వ‌చ్చే హార్స్ రైడింగ్ సీన్లు.. వీఎఫ్ఎక్స్ వర్క్‌పై అసంతృప్తి
  • దాంతో ఆ సీన్ల తొల‌గింపు.. 20 నిమిషాల మేర త‌గ్గిన మూవీ నిడివి
ప‌వ‌ర్ స్టార్‌ పవన్ క‌ల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతోకాలంగా ఆత్రుత‌గా ఎదురుచూసిన సినిమా 'హరిహర వీరమల్లు' నిన్న‌ విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి చిత్ర బృందం  హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ప‌వ‌న్ కృతజ్ఞతలు తెలియ‌జేశారు. 

అయితే, మూవీలోని కొన్ని సీన్లపై ప్రేక్ష‌కులు పెద‌వి విరిచారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో వ‌చ్చే హార్స్ రైడింగ్ సీన్లు, వీఎఫ్ఎక్స్‌ వర్క్ అంత‌గా న‌ప్ప‌లేద‌ని అసంతృప్తి వ్య‌క్త‌మైంది. ఈ నేపథ్యంలో మేక‌ర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని సన్నివేశాలను తొల‌గించి నిడివిని తగ్గించారు. సెకండాఫ్‌లో ఉన్న హార్స్ రైడింగ్, తోడేలు తదితర సీన్లను పూర్తిగా తొలగించారని తెలుస్తోంది. 

ముఖ్యంగా కోహినూర్ వజ్రం కోసం వెళ్లే జర్నీకి సంబంధించిన స‌న్నివేశాల‌ను కట్ చేసినట్టు స‌మాచారం. మొత్తం మీద సినిమాకు 2 గంటల 42 నిమిషాల నిడివి ఉండగా, ఇప్పుడు దాన్ని 2 గంటల 22 నిమిషాలకు ట్రిమ్‌ చేశార‌ని తెలుస్తోంది. ఈ మార్పులతో గురువారం రాత్రి నుంచే అన్ని థియేటర్లలో షోలు న‌డిచాయ‌ని స‌మాచారం. 

ఇక, మూవీకి వ‌స్తున్న రెస్పాన్స్ నేప‌థ్యంలో స‌క్సెస్ మీట్ ఏర్పాటు చేయ‌గా, ఈ ఈవెంట్‌లో పవన్ మాట్లాడుతూ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సోషల్ మీడియా ట్రోల్స్‌, నెగటివ్ కామెంట్స్‌ను ప‌ట్టించుకోవ‌ద్దని తెలిపారు. విమర్శలు వస్తే, మన స్థాయిని గుర్తు చేస్తున్నట్టే అని ఆయ‌న‌ అభిప్రాయపడ్డారు. అవ‌స‌ర‌మైతే విమర్శలను తిప్పికొట్టాల‌ని అభిమానులకు ప‌వ‌న్ పిలుపునిచ్చారు.


More Telugu News