భారత్ మరో కీలక ఘనత... మలేరియా నివారణకు స్వదేశీ వ్యాక్సిన్

  • భారతీయ పరిశోధన సంస్థల కీలక ముందడుగు
  • 'అడ్‌ఫాల్సివాక్స్' పేరిట స్వదేశీ మలేరియా వ్యాక్సిన్‌ అభివృద్ధి 
  • సంప్రదాయ వ్యాక్సిన్ లతో పోల్చితే విస్తృత రక్షణ
భారత్ మలేరియా నిర్మూలన దిశగా కీలక ముందడుగు వేసింది. భారత వైద్య పరిశోధన మండలి (ICMR), భువనేశ్వర్‌లోని రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (RMRCBB), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ (NIMR) మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ (DBT-NII) సంయుక్తంగా 'అడ్‌ఫాల్సివాక్స్' అనే స్వదేశీ మలేరియా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. 

ఈ వ్యాక్సిన్ ను మలేరియాకు కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైన ప్లాస్మోడియం ఫాల్సిపారమ్ పరాన్నజీవి యొక్క రెండు కీలక దశలను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. ప్రీ-క్లినికల్ పరీక్షల్లో ఈ వ్యాక్సిన్ అద్భుతమైన ఫలితాలను చూపింది. ఇది ప్లాస్మోడియం ఒకే దశను లక్ష్యంగా చేసుకునే సాంప్రదాయ వ్యాక్సిన్‌లతో పోలిస్తే విస్తృత రక్షణను అందిస్తుందని, రోగనిరోధక వ్యవస్థ నుంచి మలేరియా పరాన్నజీవి తప్పించుకునే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీర్ఘకాల రోగనిరోధక శక్తిని అందిస్తుందని, ఈ వ్యాక్సిన్ సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద 9 నెలలకు పైగా స్థిరంగా ఉంటుందని పరీక్షలు సూచిస్తున్నాయి. 

ఈ వ్యాక్సిన్‌ను లాక్టోకాకస్ లాక్టిస్ బ్యాక్టీరియా ఉపయోగించి తయారు చేశారు, ఇది వ్యక్తులను రక్షించడమే కాకుండా మలేరియా వ్యాప్తిని కూడా తగ్గిస్తుంది. ఐసీఎంఆర్ ఈ వ్యాక్సిన్ టెక్నాలజీని పరిశ్రమలకు, తయారీదారులకు నాన్-ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాల ద్వారా లైసెన్స్ చేయాలని యోచిస్తోంది. దీని ద్వారా విస్తృత ప్రజారోగ్య ప్రయోజనాలను సాధించడం లక్ష్యంగా ఉంది. 

'మేక్ ఇన్ ఇండియా' ఉద్దేశాన్ని నెరవేర్చే ఈ స్వదేశీ వ్యాక్సిన్, మలేరియా నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి దశలో ఉంది మరియు ఇంకా వాణిజ్య లేదా క్లినికల్ ఉపయోగం కోసం అందుబాటులో లేదు


More Telugu News