పహల్గామ్ ఉగ్రదాడి వాళ్లే చేశారనడానికి ఆధారాలు ఏవి?: పాక్ మంత్రి వ్యాఖ్యలు

  • ఏప్రిల్ 22న పహల్గామ్ లో ఉగ్రదాడి
  • ఈ దాడిలో టీఆర్ఎఫ్ కు సంబంధం లేదంటున్న పాక్ విదేశాంగ మంత్రి దార్
  • ఇది చట్టవిరుద్ధ సంస్థ కాదని వెల్లడి
  • ఇప్పటికే టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా
  • అయినప్పటికీ నిస్సిగ్గుగా పార్లమెంటులో ప్రకటన చేసిన దార్
పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) పాత్ర ఉందంటూ భారత్ చేస్తున్న వాదనలను ఖండించారు. టీఆర్ఎఫ్ పాత్ర ఉంటే, అందుకు సంబంధించిన ఆధారాలను చూపించాలని సవాల్ విసిరారు. పాకిస్థాన్ పార్లమెంట్‌లో దార్ ప్రసంగిస్తూ... టీఆర్ఎఫ్‌ను చట్టవిరుద్ధ సంస్థగా పరిగణించడం లేదని, ఈ దాడిలో టీఆర్ఎఫ్ పాల్గొన్నట్లు ఆధారాలు లేవని పేర్కొన్నారు. 

దార్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో వివాదాస్పదంగా మారాయి. ఎందుకంటే టీఆర్ఎఫ్‌ను అమెరికా తాజాగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. 

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఈ దాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ దాడికి తమదే బాధ్యత అని లష్కరే తోయిబా ముసుగు సంస్థ టీఆర్ఎఫ్ ప్రకటించుకుంది. అయినప్పటికీ, దార్ తమపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. ఐరాస భద్రతామండలి (యూఎన్ఎస్సీ) ఖండన ప్రకటనలో టీఆర్ఎఫ్ పేరును తొలగించడానికి పాకిస్తాన్, తమ నాన్-పర్మినెంట్ సభ్యత్వాన్ని ఉపయోగించిందని వెల్లడించారు. "మేము టీఆర్ఎఫ్‌ను చట్టవిరుద్ధంగా భావించడం లేదు. పహల్గామ్ దాడిని వారు చేపట్టారని ఆధారాలు చూపండి" అని దార్ అన్నారు.




More Telugu News