Chandrababu Naidu: ఫైబర్ నెట్‌లో వైసీపీ కార్యకర్తల్ని నియమించి దోచుకున్నారు: సీఎం చంద్రబాబు

Chandrababu Slams YSRCP for FiberNet Corruption in Andhra Pradesh
షార్ట్స్‌లో చూడండి
గతంలో 2014-19 మధ్య ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని... దీన్ని తిరిగి గాడిలో పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో అన్నారు. సంస్థ ముందున్న సవాళ్లు, ఆర్థిక సమస్యలు, ఫైబర్ నెట్‌ను పూర్తి స్థాయిలో గాడిన పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కొత్త పాలసీ నిర్ణయాలపై సోమవారం నాడు సచివాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు, విద్యార్థులకు, ప్రభుత్వ విభాగాలకు ఉపయోగపడాల్సిన వ్యవస్థను గత ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం వాడుకుందని... దీంతో ఫైబర్ నెట్ ప్రాజెక్టు లక్ష్యం దెబ్బతిందని సీఎం అన్నారు. 2019లో 8.70 లక్షల కనెన్షన్‌లు ఉండగా... వైసీపీ ప్రభుత్వంలో వాటి సంఖ్య 4.50 లక్షలకు పడిపోవడమే ఇందుకు నిదర్శనం అని గుర్తు చేశారు.

దొడ్డిదారిన వైసీపీ  కార్యకర్తలకు కొలువులు

“నాడు కేవలం 130 మంది ఉద్యోగులతో సంస్థను అద్భుతంగా నడిపాం... 8 లక్షలకు పైగా కనెక్షన్లు ఇచ్చాం...కానీ వైసీపీ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలకు ఉద్యోగుల కోసం సంస్థలో లేని పోస్టులు సృష్టించింది. 130 మంది ఉద్యోగులను 1,350కి పెంచి దోచుకుంది. ప్రభుత్వ వ్యవస్థల్లో వందల, వేల మందిని నియమించి... పార్టీ కోసం పని చేయించుకునే కొత్త తరహా అవినీతికి గత ప్రభుత్వం పాల్పడింది. ఫైబర్ నెట్‌లో సొంత వాళ్లను నియమించి పార్టీ కోసం పని చేయించుకున్నారు. దీనికి కారణమైన వారిని గుర్తించాలి. నాటి నియామకాలపై విచారణ జరిపి... అన్ని వివరాలు వెలుగులోకి తీసుకురావాలి. ఇదే సమయంలో నాటి తప్పులను సరిదిద్ది  భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి” అని సీఎం అన్నారు. ప్రస్తుతం 4,53,525 వరకు ఉన్న కనెక్షన్లను... తిరిగి 8 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని సూచించారు.

10 ఏళ్లలో కేంద్రం నుంచి రూ.1,900 కోట్లు

భారత్‌ నెట్(Amended BharatNet Programme-ABP)తో ఏపీ ఫైబర్ నెట్‌ను అనుసంధానించేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏపీ ఫైబర్ నెట్‌కు 2025 నుండి 2035 వరకు రూ.1,900 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లోని 1,692 గ్రామ పంచాయతీల ఫైబర్ నెట్‌వర్క్‌ను లీనియర్ నుంచి రింగ్ ఆర్కిటెక్చర్‌కు మార్చేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. 480 కొత్త గ్రామ పంచాయతీలకు రింగ్ ఆర్కిటెక్చర్‌తో కనెక్టివిటీ కల్పిస్తారు. ఇందుకోసం మొత్తం రూ.430 కోట్లు కేంద్రం ఇస్తుంది. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఒక ప్రత్యేక వాహక సంస్థ  (SPV) ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.  

కనెక్షన్లు పెంచడంపై ప్రత్యేక దృష్టి

రాష్ట్ర స్థాయి పెట్టుబడి వ్యయం, నిర్వహణ వ్యయం పైనా సమీక్షలో ముఖ్యమంత్రి చర్చించారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో కనెక్షన్ల తగ్గుదలకు గల కారణాలను విశ్లేషించారు. 2014–19లో రూ. 149కి ట్రిపుల్ ప్లే (ఫోన్ + IPTV + ఇంటర్నెట్) ద్వారా 150 ఛానెళ్లతో సేవలు అందించగా, 2019–24లో నెల వారీ చార్జీలను రూ.350కి పెంచడంతో పాటు నాణ్యత లేని ప్రసారాలు అందించడం వల్ల కనెక్షన్లు తగ్గినట్టు అధికారులు తెలిపారు. ఫైబర్ నెట్‌కు సెట్‌ టాప్ బాక్స్ సరఫరాదారుల ఎంపికను తక్షణమే పూర్తి చేయాలని, కొత్త బాక్స్‌లను తీసుకున్న స్థానిక కేబుల్ ఆపరేటర్ తో ఆదాయానికి సంబంధించిన విధానాన్ని పునః సమీక్షించాలని సూచించారు. దూర ప్రాంతాల్లో సెట్‌ టాప్ బాక్స్ సరఫరా కోసం ప్రైవేట్ సంస్థలను కూడా భాగస్వాములుగా తీసుకోవాలని అన్నారు. 

12,946 పంచాయతీలకు ఫైబర్ నెట్

గ్రామ పంచాయతీలను నెట్ అనుసంధానంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 12,946 గ్రామ పంచాయతీలకు ఫైబర్ నెట్ సౌకర్యం కల్పించడం జరిగింది. 104 ప్రభుత్వ సంస్థలు-కార్యాలయాలకు ఫైబర్ నెట్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం 5 ప్యాకేజీల రూపంలో గృహాలకు ఫైబర్ నెట్ కనెక్షన్లు అందిస్తున్నారు. 21,000 కంటే ఎక్కువ సంస్థలు హై-స్పీడ్ బ్రాడ్‌ బ్యాండ్‌ను పొందుతున్నాయి. 175 టెలికాం టవర్స్‌ తో లింక్ చేశారు. దీనిని మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 442 ఉద్యోగులు, అధికారులు ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్నారు. 

ఫైబర్‌ నెట్‌ విస్తరణలో దేశంలోనే టాప్ 

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 78,355 కి.మీ. మేర ఫైబర్ నెట్ విస్తరించగా, మొత్తం 2 లక్షల కి.మీ. మేర ఫైబర్ నెట్ లైన్ వేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఫైబర్ నెట్ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ముందుంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానంలో మహారాష్ట్ర 50,481 కి.మీ., తమిళనాడు 49,616 కి.మీ., గుజరాత్ 35,246 కి.మీ., తెలంగాణ 29,143 కి.మీ. మేర పైబర్ నెట్‌ కలిగి ఉన్నాయి.
Go Back to Shorts
Chandrababu Naidu
AP FiberNet
Andhra Pradesh
YSRCP
FiberNet Scam
BharatNet Programme
గ్రామ పంచాయతీలు
Internet Services
Optical Fiber
AP Politics

More Telugu News