ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రి.. ఆ విషయం డీకే శివకుమారే చెప్పారు: సిద్ధరామయ్య

  • కర్ణాటకలో ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సిద్ధరామయ్య వ్యాఖ్య
  • నాయకత్వ మార్పుపై వస్తున్న ప్రచారంలో నిజం లేదని వెల్లడి
  • ముఖ్యమంత్రి పదవి పంపకాలపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న సిద్ధరామయ్య
  • ప్రస్తుతం కుర్చీ ఖాళీగా లేదని డీకే శివకుమారే అన్నారని గుర్తు చేసిన సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి మార్పుపై కొంతకాలంగా కొనసాగుతున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక్క ప్రకటనతో తెరదించారు. రాష్ట్రానికి ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించేందుకు తనను రాజీనామా చేయమని అధిష్ఠానం కోరినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధరామయ్య మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి పదవిలో పూర్తి ఐదేళ్లు నేనే ఉంటాను. ఈ విషయాన్ని జులై 2వ తేదీన డీకే శివకుమార్ సమక్షంలోనే స్పష్టం చేశాను. ఆయన కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీదారుడే, అందులో తప్పేమీ లేదు. అయితే 'ప్రస్తుతం కుర్చీ ఖాళీగా లేదు' అని ఆయనే అన్నారు కదా" అని సిద్ధరామయ్య గుర్తు చేశారు. డీకే శివకుమార్‌కు మద్దతు ఇచ్చే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన అంగీకరించారు.

రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే అంశంపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమకు ఎటువంటి సూచనలు ఇవ్వలేదని ఆయన అన్నారు. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఆయన స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగానే ఉందని, నిధుల కొరత లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను, ముఖ్యంగా ఈడీని కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు.


More Telugu News