చైనాతో కాదు, టిబెట్‌తోనే మాకు సరిహద్దు: అరుణాచల్ సీఎం పెమా ఖండు కీలక వ్యాఖ్యలు

  • అరుణాచల్‌కు చైనాతో సరిహద్దు లేదన్న సీఎం పెమా ఖండు
  • తమ సరిహద్దు టిబెట్‌తోనేనని వ్యాఖ్య
  • టిబెట్‌ను చైనా బలవంతంగా ఆక్రమించుకుందని వెల్లడి
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు, చైనాకు గట్టి షాకిచ్చేలా కీలక వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చైనాతో అసలు సరిహద్దే లేదని, తమ రాష్ట్రానికి టిబెట్‌తో మాత్రమే సరిహద్దు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదంపై కొత్త చర్చకు దారితీశాయి.

ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెమా ఖండు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా, అరుణాచల్ ప్రదేశ్ చైనాతో 1200 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుందని విలేకరి ప్రస్తావించగా, సీఎం ఖండు వెంటనే కలగజేసుకున్నారు. "ఈ విషయంలో నేను మిమ్మల్ని సరిదిద్దాలి. మాకు చైనాతో కాదు, టిబెట్‌తో సరిహద్దు ఉంది" అని ఆయన వివరించారు. భారతదేశంలోని ఏ రాష్ట్రానికీ చైనాతో సరిహద్దు లేదని ఆయన అన్నారు.

చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ, 1950లో చైనా టిబెట్‌ను బలవంతంగా ఆక్రమించుకుందని పెమా ఖండు గుర్తుచేశారు. "అధికారికంగా టిబెట్ ఇప్పుడు చైనా ఆధీనంలో ఉందని మాకు తెలుసు. కానీ వాస్తవానికి మా సరిహద్దు ఎప్పుడూ టిబెట్‌తోనే ఉండేది. అరుణాచల్ ప్రదేశ్ భూటాన్, మయన్మార్‌లతో పాటు టిబెట్‌తో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటోంది" అని ఆయన తెలిపారు.

అరుణాచల్ ప్రదేశ్‌ను తమ భూభాగంలోని దక్షిణ టిబెట్ (జాంగ్నాన్) అని చైనా చాలాకాలంగా వాదిస్తోంది. తమ మ్యాపుల్లో కూడా చూపిస్తూ వివాదాన్ని రాజేస్తోంది. అయితే, చైనా వాదనలను భారత్ ఎప్పటికప్పుడు తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని తేల్చి చెబుతోంది. ఈ నేపథ్యంలో పెమా ఖండు చేసిన వ్యాఖ్యలు చైనా వాదనను మరింత బలహీనపరిచేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 


More Telugu News