ప్రారంభానికి ముందే కొట్టుకుపోయిన కొత్త రోడ్డు.. వీడియో ఇదిగో!

  • స్టేట్ హైవే నిర్మాణ నాణ్యతపై స్థానికుల తీవ్ర విమర్శలు
  • రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాలో భారీ వర్షాలకు కాట్లీ నదికి పోటెత్తిన వరద
  • నది ఉధృతికి రోడ్డులో కొంత భాగం పూర్తిగా ధ్వంసం
  • సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
రాజస్థాన్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఓ నూతన రాష్ట్ర రహదారి.. భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. ఝున్‌ఝును జిల్లా ఉదయ్‌పూర్‌వాటి ప్రాంతంలో ఈ రహదారిని ఆరు నెలల క్రితమే నిర్మించారు. దీంతో రహదారి నిర్మాణ నాణ్యతపై స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఉదయ్‌పూర్‌వాటి ప్రాంతంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం ఇక్కడ 86 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఇక్కడి కాట్లీ నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. నది ఉధృతంగా ప్రవహించి, రహదారిని బలంగా ఢీకొట్టింది. వరద ఉధృతికి రోడ్డు కింద మట్టి కొట్టుకుపోవడంతో రహదారిలో ఓ పెద్ద భాగం కుప్పకూలింది. రోడ్డుతో పాటు ఓ విద్యుత్ స్తంభం కూడా నీటిలో కూలిపోవడం స్థానికులు తీసిన వీడియోలలో స్పష్టంగా కనిపించింది.

బఘూలీ, జహాజ్ గ్రామాలను జాతీయ రహదారి 52తో అనుసంధానించేందుకు ఈ రహదారిని నిర్మించారు. ప్రారంభానికి ముందే రోడ్డు ఇలా కొట్టుకుపోవడంతో నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) అధికారులు విచారణ చేపట్టారు.


More Telugu News