హాస్టల్ ను ముంచెత్తిన వరద.. 162 మంది పిల్లలను కాపాడుకున్న స్థానికులు.. వీడియో ఇదిగో!

  • జార్ఖండ్‌లో భారీ వర్షాలకు నీట మునిగిన రెసిడెన్షియల్ స్కూల్
  • పాఠశాలలో చిక్కుకుపోయిన 162 మంది విద్యార్థులు
  • రాత్రంతా పాఠశాల పైకప్పుపైనే తలదాచుకున్న విద్యార్థులు
జార్ఖండ్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాల పూర్తిగా నీట మునిగింది. అందులో చిక్కుకుపోయిన 162 మంది విద్యార్థులను పోలీసులు, స్థానికులు కలిసి కాపాడారు. విద్యార్థులు శనివారం రాత్రంతా వర్షంలో తడుస్తూ భయంతో పాఠశాల పైకప్పుపైనే గడిపారు. తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని కోవాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లవ్ కుశ్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

భారీ వర్షాలతో పాఠశాల భవనం నీటిలో మునిగిపోవడంతో, ఉపాధ్యాయులు విద్యార్థులను మేడపైకి చేర్చారని ఎస్పీ (రూరల్) రిషభా గర్గ్ తెలిపారు. ఆదివారం ఉదయం 5:30 గంటలకు సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్తులతో కలిసి సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రస్తుతం పాఠశాలకు సెలవులు ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు.

స్థానిక విద్యార్థులను వారి ఇళ్లకు పంపించగా, ఇతర ప్రాంతాల విద్యార్థులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు, భారీ వర్షాలు, ఒడిశాలోని రైరంగ్‌పూర్ డ్యామ్ నుంచి నీటి విడుదల కారణంగా ఖర్కాయ్, సువర్ణరేఖ నదుల నీటిమట్టం పెరిగే ప్రమాదం ఉందని తూర్పు సింగ్‌భూమ్, సరైకెలా-ఖర్‌స్వాన్ జిల్లాల యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.




More Telugu News