8 నెలలే అన్నారు.. 10 ఏళ్లయింది: బుమ్రా

  • ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో బుమ్రా నిప్పులు
  • తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు
  • అంతర్జాతీయ క్రికెట్‌లో బుమ్రాకు పదేళ్లు పూర్తి
  • త‌న కెరీర్‌పై వ‌చ్చే విమర్శలపై స్పందించిన పేస్ గుర్రం
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టి భారత జట్టుకు కీలక ఆధిక్యం రావడంలో ముఖ్య పాత్ర పోషించాడు. మిగతా బౌలర్ల నుంచి ఆశించినంత సహకారం లభించకపోయినా, ఒంటిచేత్తో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, కెప్టెన్ బంతినిచ్చినప్పుడు వికెట్లు తీసి జట్టును ఆదుకోగలనని ఈ ప్రదర్శనతో మరోసారి నిరూపించుకున్నాడు.

తరచూ గాయాల బారిన పడుతుండటంతో, బుమ్రా కెరీర్ ఎక్కువ కాలం సాగదని, కేవలం 8-10 నెలలు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ ఆడగలడని గతంలో కొందరు విమర్శలు చేశారు. అయితే, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో పదేళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు. తన అపారమైన ఆత్మవిశ్వాసం, మొక్కవోని పట్టుదలతో భారత జట్టులో మేటి పేసర్‌గా ఎదిగాడు. ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన, టెస్టు క్రికెట్‌లో అతనికి ఇది 14వ సారి కావడం విశేషం.

ఈ ఘనత సాధించిన అనంతరం తనపై వచ్చే విమర్శల గురించి బుమ్రా మాట్లాడుతూ... "ఇన్ని సంవత్సరాలుగా కొందరు నా గురించి ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. కొందరు నేను 8 నెలలు మాత్రమే ఆడగలనని అన్నారు. మరికొందరు 10 నెలలు మాత్రమే ఆడగలనని అన్నారు. కానీ, నేను అంతర్జాతీయ క్రికెట్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్నాను. 

ఐపీఎల్‌లో కూడా 12-13 ఏళ్లు ఆడాను. నేను గాయపడిన ప్రతీసారి, ఇక నా కెరీర్ ముగిసిపోయిందని కొందరు అంటూ ఉంటారు. వాళ్లను అలాగే అననివ్వండి. నా పని నేను చేసుకుంటూ వెళ‌తాను. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఇలాంటి మాటలు వినపడుతూనే ఉంటాయి. నాలో శక్తి ఉన్నంత వరకు ఆడుతూనే ఉంటాను. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఆ తర్వాతి విషయాలను దేవుడికి వదిలేస్తాను" అని బుమ్రా అన్నాడు.

తన గురించి మాట్లాడే వారిని తాను నియంత్రించలేనని తెలిపాడు. "నా గురించి ఏం రాయాలో నేను వారికి సలహా ఇవ్వలేను. వ్యూయర్‌షిప్ కోసమే నా పేరును వాడుకుంటున్నారు. వాటి గురించి నేను పెద్దగా బాధపడను" అని బుమ్రా స్పష్టం చేశాడు.


More Telugu News