దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

  • 1,046 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 319 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 86.59
దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో కళకళలాడాయి. అంతర్జాతీయంగా ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ, మన సూచీలు సానుకూలంగా స్పందించడం గమనార్హం. ఈ లాభాలతో గత మూడు రోజులుగా కొనసాగుతున్న నష్టాలకు తెరపడింది. మదుపరులు కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి.

ఈరోజు ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్‌ ఏకంగా 1,046 పాయింట్లు పెరిగి 82,408కి ఎగబాకింది. నిఫ్టీ కూడా 319 పాయింట్లు లాభపడి 25,112 వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఆటోమొబైల్, మెటల్‌ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు స్పష్టంగా కనిపించింది. వీటితో పాటు మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు కూడా లాభాలతో ముగియడం విశేషం.

సెన్సెక్స్‌ 30 సూచీలోని షేర్లలో మారుతీ సుజుకీ మినహా మిగిలిన అన్ని కంపెనీల షేర్లూ లాభాల్లోనే ముగిశాయి. ప్రధానంగా లాభపడిన వాటిలో భారతీ ఎయిర్‌టెల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నెస్లే ఇండియా షేర్లు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్ బ్యారెల్‌ ధర 76 డాలర్లుగా ఉండగా, బంగారం ఔన్సు ధర 3,372 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.59 వద్ద స్థిరపడింది.



More Telugu News