మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్యోగుల కోతలు.. ఈసారి వేల సంఖ్యలో సేల్స్ సిబ్బందిపై వేటు?

  • ఈ ఏడాది ఇది మూడో విడత లేఆఫ్స్ 
  • వేల సంఖ్యలో సేల్స్ విభాగ ఉద్యోగులపై ప్రభావం?
  • జులై ఆరంభంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
  • కృత్రిమ మేధలో పెట్టుబడులు, సంస్థాగత మార్పులే కారణమని సమాచారం
  • ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో వేలమందిని తొలగించిన సంస్థ
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు లేఆఫ్‌లు ప్రకటించిన సంస్థ, ఇప్పుడు మూడో విడత కోతలకు ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. రాబోయే జులై నెల ఆరంభంలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడవచ్చని ప్రముఖ వార్తాసంస్థ బ్లూమ్‌బర్గ్‌ తన కథనంలో పేర్కొంది. ఈ దఫా లేఆఫ్‌ల ప్రభావం ముఖ్యంగా సంస్థ విక్రయాల (సేల్స్) విభాగంపై అధికంగా ఉండొచ్చని అంచనా.

సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా, అలాగే కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ కొత్త ఆర్థిక సంవత్సరం జులైలోనే ప్రారంభం కానుండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే సంస్థ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

కాగా, ఈ ఏడాది మే నెలలో మైక్రోసాఫ్ట్ సుమారు 6,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఆ ప్రకటన వెలువడిన కొద్ది వారాల వ్యవధిలోనే మరో 300 మందికి పైగా సిబ్బందిని విధుల నుంచి తప్పించింది. గతంలో జరిగిన లేఆఫ్‌లలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రోడక్ట్ డెవలపర్లు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఇప్పుడు జరగబోయే కోతల్లో సేల్స్ బృందాలే ప్రధాన లక్ష్యంగా ఉండొచ్చని సమాచారం.

గతేడాది జూన్ నాటికి మైక్రోసాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,28,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వారిలో దాదాపు 45,000 మంది సేల్స్, మార్కెటింగ్ విభాగాలకు చెందినవారే. అంతకుముందు 2023 జనవరిలో కూడా కంపెనీ సుమారు 10,000 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.


More Telugu News