గిల్ చెప్పింది చేసే రకం: కిర్ స్టెన్ కితాబు

  • టీమిండియా టెస్ట్ జట్టుకు శుభ్‌మన్ గిల్ కొత్త సారథి
  • ఇంగ్లండ్‌తో రేపటి నుంచి లీడ్స్‌లో తొలి టెస్ట్
  • గిల్‌కు గొప్ప నాయకుడయ్యే సత్తా ఉందన్న గ్యారీ కిర్‌స్టన్
  • మాటలతో పాటు చేతల్లోనూ గిల్ ముందుంటాడని ప్రశంస
భారత టెస్ట్ క్రికెట్ జట్టు నూతన సారథిగా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో, అతని నాయకత్వ పటిమపై మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్‌తో రేపు (జూన్ 20) లీడ్స్‌లోని హెడింగ్లే మైదానంలో ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్‌లో గిల్ నాయకత్వానికి, బ్యాటింగ్‌కు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది.

గత నెలలో రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో, అతని స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ కూడా టెస్టులకు వీడ్కోలు పలకడంతో, భారత బ్యాటింగ్ లైనప్‌లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే అదనపు బాధ్యత కూడా గిల్ భుజాలపై పడింది. ఈ నేపథ్యంలో, గిల్ నాయకత్వ లక్షణాలపై భారత మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సమయంలో గిల్‌ను చాలా దగ్గరగా గమనించానని తెలిపాడు. 

"శుభ్‌మన్ గొప్ప నాయకుడు అవుతాడని నేను భావిస్తున్నాను. అతను చాలా తెలివైన క్రికెటర్, ఆటకు సంబంధించి మంచి అవగాహన ఉంది. అద్భుతమైన ప్రతిభతో పాటు మంచి వ్యక్తిత్వం కూడా అతని సొంతం, ఇది నాయకుడిగా చాలా ముఖ్యం" అని కిర్‌స్టన్ జియోహాట్‌స్టార్‌లో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. "నాయకత్వ స్థానాల్లోకి వచ్చినప్పుడు ఒత్తిడి ఎదురవుతుంది, మీ నాయకత్వం పరీక్షించబడుతుంది. ఏ యువ నాయకుడికైనా, నేర్చుకునే, మెరుగుపరుచుకునే, ఎదిగే సామర్థ్యం నిరంతరం పరిశీలనలో ఉంటుంది. అయితే, ఒక మంచి నాయకుడిగా ఎదగడానికి అవసరమైన అన్ని మౌలిక లక్షణాలు అతనిలో ఉన్నాయని నేను నమ్ముతున్నాను" అని వివరించాడు.

గిల్ గురించి కిర్‌స్టన్ ఇంకా మాట్లాడుతూ, "శుభ్‌మన్‌లో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే, అతను చెప్పింది చేసే రకం. శిక్షణ, సన్నద్ధత విషయంలో చాలా క్రమశిక్షణతో, శ్రద్ధగా ఉంటాడు. ఇది ఇతర ఆటగాళ్లకు గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది. అంతర్జాతీయ వేదికపై అతను సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడని నేను భావిస్తున్నాను" అని పేర్కొన్నారు.

కాగా, ఇప్పటివరకు ఇంగ్లండ్ గడ్డపై గిల్ కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. అక్కడ అతని సగటు 15 పరుగుల కంటే తక్కువగా ఉండటం గమనార్హం.


More Telugu News