వివాదాల నడుమ వాషింగ్టన్‌లో పాక్ ఆర్మీ చీఫ్.. నేడు ట్రంప్‌తో ముఖాముఖి

  • నేడు ట్రంప్‌తో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భేటీ
  • వైట్‌హౌస్‌లో మధ్యాహ్నం లంచ్ మీటింగ్ ఖరారు
  • సైనిక, వ్యూహాత్మక సంబంధాల బలోపేతమే లక్ష్యం
  • వాషింగ్టన్‌లో మునీర్‌ బస చేసిన హోటల్ వద్ద నిరసనలు
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేడు వైట్‌హౌస్‌లో సమావేశం కానున్నారు. అధ్యక్షుడి అధికారిక షెడ్యూల్ ప్రకారం ఈ లంచ్ మీటింగ్ వైట్‌హౌస్‌లోని క్యాబినెట్ రూమ్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు జరగనుంది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య సైనిక, వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి ఉద్దేశించినదిగా తెలుస్తోంది.

ఐదు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం వాషింగ్టన్ చేరుకున్న జనరల్ మునీర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌లతో కూడా చర్చలు జరపనున్నారని పాకిస్థానీ దినపత్రిక డాన్ వెల్లడించింది. ఈ పర్యటన ప్రధానంగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా సాగుతోందని అధికారులు తెలిపారు.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఆరో రోజుకు చేరిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ ‘బేషరతుగా లొంగిపోవాలని’ ట్రంప్ డిమాండ్ చేయగా, పాక్ ఆర్మీ చీఫ్ గతంలో టెహ్రాన్‌కు మద్దతు ప్రకటించిన విషయం గమనార్హం.

ఈ నెల 14న జరిగిన అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవ వేడుకలకు మునీర్‌ను ఆహ్వానించినట్టు వచ్చిన వార్తలను ఇటీవల వైట్‌హౌస్ ఖండించింది. అంతకుముందు ఆయన పరేడ్‌కు హాజరయ్యారన్న వార్తలను తోసిపుచ్చింది. ఇప్పుడు ఈ సమావేశ వార్త వెలుగులోకి వచ్చింది.

కశ్మీర్ దాడి.. జైశంకర్ వ్యాఖ్యల ప్రభావం
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించిన తర్వాత మునీర్ అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ దాడికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించింది. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించడంతో పాటు, పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు పెరిగాయి.

వాషింగ్టన్‌లో నిరసనలు
మునీర్ పర్యటన సైనిక సంబంధాలను స్థిరీకరించే ప్రయత్నంగా చెబుతున్నప్పటికీ, ఇది వివాదరహితంగా సాగడం లేదు. వాషింగ్టన్‌లోని ఫోర్ సీజన్స్ హోటల్ వెలుపల, మునీర్ బస చేస్తున్న చోట, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు నిరసన తెలిపారు. ఆర్మీ చీఫ్‌ను ‘పాకిస్థానీయుల హంతకుడు’, ‘ఇస్లామాబాద్ హంతకుడు’ అంటూ నినాదాలు చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు. అధికారులు వస్తున్న వాహనాలను చూస్తూ ఒక నిరసనకారుడు ‘గీదడ్, గీదడ్, గీదడ్’ (నక్క, నక్క, నక్క) అని అరవడం వీడియోలో రికార్డయింది. 


More Telugu News