సరూర్‌నగర్ మైనర్ బాలికపై అత్యాచారం కేసు: నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగారం

  • మైనర్‌పై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
  • రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు
  • నిందితుడు దర్శనం నాగరాజుకు రూ.20 వేల జరిమానా
  • బాధిత బాలికకు రూ.6 లక్షల పరిహారం
హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు కఠిన శిక్ష విధించింది. ఈ దారుణానికి పాల్పడిన దర్శనం నాగరాజు అనే వ్యక్తికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.20,000 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.

వివరాల్లోకి వెళితే, సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురానికి చెందిన నాగరాజు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో నివాసం ఉంటూ తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఇతను 2024లో సరూర్‌నగర్ ప్రాంతానికి చెందిన ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వెంట తీసుకెళ్లాడు. ఆ తర్వాత పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు పోక్సో చట్టంతో పాటు బాల్య వివాహాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు నాగరాజును అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును విచారణాధికారి సైదిరెడ్డి వేగంగా పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు.

ఈ ఛార్జిషీట్‌పై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు, నాగరాజును దోషిగా నిర్ధారించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.20,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. అంతేకాకుండా, అత్యాచారానికి గురైన బాధిత బాలికకు రూ.6 లక్షల పరిహారం అందించాలని కూడా కోర్టు ఆదేశించింది.


More Telugu News