వివాదంలో విరాట్.. యువ ఆట‌గాడిపై స్లెడ్జింగ్‌తో కోహ్లీపై వ్య‌తిరేక‌త‌!

  • నిన్న ముల్లాన్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్-1
  • పీబీకేఎస్‌పై ఆర్‌సీబీ సునాయాస విజ‌యం
  • పంజాబ్ ప్లేయ‌ర్ ముషీర్ ఖాన్‌పై కోహ్లీ స్లెడ్జింగ్‌
  • నీళ్ల బాటిళ్లు అందించిన‌వాడు బ్యాటింగ్‌కు వ‌చ్చాడంటూ హేళ‌న‌
  • విరాట్‌పై పీబీకేఎస్ అభిమానుల ఆగ్ర‌హం
గురువారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్-1లో పంజాబ్ కింగ్ (పీబీకేఎస్‌), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) తల‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఈ హైవొల్టేజీ మ్యాచ్‌లో ఆర్‌సీబీ సునాయాస విజ‌యంతో ఫైన‌ల్‌కు చేరింది. ఆల్‌రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో బెంగ‌ళూరు అద‌ర‌గొట్టింది. 

అయితే, ఈ మ్యాచ్‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న ఇప్పుడు ఆర్‌సీబీ స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీని ఇర‌కాటంలో ప‌డేసింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ్యాటింగ్‌కు దిగిన యువ ఆట‌గాడు ముషీర్ ఖాన్‌పై కింగ్ కోహ్లీ స్లెడ్జింగ్‌కు దిగాడు. ముషీర్‌ను ఉద్దేశించి.. "వాట‌ర్ బాటిల్స్ అందించేవాడు బ్యాటింగ్‌కు వ‌చ్చాడు" అని విరాట్ నోరు పారేసుకున్నాడు. ఈ మేర‌కు కోహ్లీ సంజ్ఞ‌ల తాలూకు వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

ముషీర్ ఖాన్ కొన్ని ఓవ‌ర్ల ముందే మైదానంలో త‌మ జ‌ట్టు ఆట‌గాళ్ల‌కు వాట‌ర్ బాటిల్స్ అందించాడు. పంజాబ్ మిడిల్ ఆర్డ‌ర్ విఫ‌లం కావ‌డంతో అత‌డు ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ్యాటింగ్‌కు క్రీజులోకి వ‌చ్చాడు. ఈ నేప‌థ్యంలో నీళ్ల సీసాలు అందించే వ్యక్తి ఇప్పుడు బ్యాటింగ్‌కు వ‌చ్చాడ‌ని కోహ్లీ... ముషీర్ ఖాన్‌ను హేళ‌న‌గా మాట్లాడాడు. 

దీంతో ప‌లువురు అభిమానుల‌కు కోహ్లీ చేసిన ప‌ని న‌చ్చ‌లేదు. దాంతో వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా విరాట్‌పై వ్య‌తిరేక‌తను వ్య‌క్తం చేశారు. ఇది కోహ్లీ స్థాయికి త‌గిన చ‌ర్య కాద‌ని, యంగ్ ప్లేయ‌ర్ల‌ను ప్రోత్స‌హించాల్సిందిపోయి.. ఇలా స్లెడ్జింగ్ చేయ‌డం ఏంట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

అయితే, కొంత‌మంది ఆర్‌సీబీ అభిమానులు మాత్రం కోహ్లీని వెన‌కేసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ఐపీఎల్ సీజ‌న్ ప్రారంభంలో ముషీర్‌కు విరాట్ త‌న బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేస్తూ... ముషీర్ ప‌ట్ల అత‌నికి అలాంటి ఉద్దేశం లేద‌ని అన్నారు. మ‌రికొంద‌రు కోహ్లీ ఓ అన్న‌లా త‌మ్ముడిలాంటి ముషీర్ ఖాన్‌ను ఆట‌ప‌ట్టించ‌డంలో త‌ప్పు ఏముంద‌ని స‌మ‌ర్థించారు. 


More Telugu News